పత్తిపాడు ఈవీఎంలు సేఫ్.. అభ్యర్థులు డోన్ట్ వర్రీ: కలెక్టర్

 

తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తడిసిపోయాయని, కాకినాడ జేఎన్‌టీయులో స్ట్రాంగ్ రూమ్‌లో దాచిన ఈవీఎంలు లోపలకి నీరు ప్రవేశించడం వల్ల తడిచిపోయాయన్న వార్తలు రావడంతో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్ పడిపోయారు. తమ జాతకాలన్నీ వున్న ఈవీఎంలు తడిచిపోతే తమ గతేంటి దేవుడా అని కంగారుపడిపోయి, ఈవీఎంల పరిస్థితి గురించి ఎంక్వయిరీ ప్రారంభించారు. ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌ని సందర్శించిన తూ.గో. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో వివరణ ఇచ్చారు. కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఈవీఎంలు మాత్రం వర్షపు నీటిలో తడవలేదని ఈవీఎంల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాకినాడ పార్లమెంట్, పత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంల కిందకి నీళ్ళు వచ్చాయని, అయితే ఈవీఎంలు ఎంతమాత్రం తడవలేదని స్పష్టం చేశారు. కాబట్టి కాకినాడ, పత్తిపాడు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులూ.. డోన్ట్ వర్రీ.. బీ హ్యాపీ..