చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ.. వైసీపీ గూటికి కీలక నేత!!

దాదాపు రెండు నెలల‌ తరువాత ఏపీ గడ్డపై అడుగుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ కీలక నేత, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అతి త్వరలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్లుగా జిల్లాకు చెందిన మంత్రితో టచ్‌లో ఉన్న ఆయన.. పార్టీ మారడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు  వార్తలొస్తున్నాయి. టీడీపీ మహానాడును 27, 28 తేదీలలో నిర్వహించనుంది. మరోవైపు, వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మే 30 కి కరెక్ట్ గా ఏడాది పూర్తవుతుంది. కావున, అదే రోజున వైసీపీ లో చేరాలని లేదా అంతకంటే ముందే మహానాడు సమయంలో పార్టీని వీడి చంద్రబాబుకి షాక్ ఇవ్వాలని చూస్తున్నారట.

2019 ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుగాలి వీచినా, ప్రకాశం జిల్లాలో మాత్రం నాలుగు సీట్లు దక్కాయి. ముఖ్యంగా పర్చూరులో సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఏలూరి గెలిచి సంచల‌నం సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా, బరిలో దగ్గుబాటి ఉన్నా.. పర్చూరులో ఏలూరి గెలుపు జెండా ఎగురవేశారు. అలాంటి ఏలూరి ఇప్పుడు టీడీపీని వీడటానికి సిద్ధమయ్యారని వార్తలు రావడం.. టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది.

ఏలూరి అధికార పార్టీ వైపు చూడటానికి ఆర్ధిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. వ్యాపారాలలో తీవ్ర నష్టాలు వచ్చాయని, చేసిన అప్పులు ఆయనను వెంటాడుతున్నాయని అంటున్నారు. ఆ అప్పుల తిప్పలు‌ పడలేకే ఆయన పార్టీ మారాల‌ని భావిస్తున్నారని సమాచారం.

కాగా, ఏలూరి పార్టీ మారాలన్న ఆలోచన వెనుక మరో కారణం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న రామనాథంను త్వరలో తొల‌గించబోతున్నారని, ఆయన స్థానంలో చీరాల‌ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు స్వాముల‌ ను ఇన్‌ఛార్జిగా నియమించబోతున్నారని అంటున్నారు. స్వాములు ఇప్పటికే నియోజకవర్గంలో పట్టుసాధిస్తున్నారు. ఆయనను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తే.. వచ్చే ఎన్నికల‌ నాటికి తనకు తీవ్రమైన పోటీ అవుతారనే భావనలో ఉన్న ఏలూరి.. పార్టీ మారడమే మేల‌నే అభిప్రాయానికి వచ్చారంటున్నారు. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన.. వచ్చే ఎన్నికల వరకు కేడర్ ని నిలుపుకొని, మళ్లీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడమంటే తలకు మించిన భారం. అదే ఇప్పుడే అధికారపార్టీలో చేరితే.. ఇప్పుడు వ్యాపారాలకు, అప్పుడు ఎన్నికల ఖర్చుకు డోకా ఉండదన్న భావనలో ఏలూరి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏలూరితో పాటు మరికొందరు కీలక నేతలు కూడా వైసీపీ గూటికి చేరుతారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో అతి త్వరలో తేలనుంది.