కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ఎలాన్ మస్క్
posted on Jul 6, 2025 11:34AM

ప్రపంచ అపర కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ ప్రకటించారు. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్చ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ తెలిపారు. మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది. ఈ రోజు మీకు మీ స్వేచ్చను తిరిగి ఇవ్వడానికి అమెరికా ఏర్పడింది అంటు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అవినీతితో మన దేశాన్ని దివాళా తీయించే విషయంలో మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒకే పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాం. ఈరోజు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది అంటూ ఆయన ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలతో పాటు మూడో పార్టీ వచ్చి చేరింది.
తమ పార్టీ 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. రెండు నుంచి మూడు సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థానాల్లో పోటీ చేసి, కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యమని వివరించారు. అయితే, మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ, ఇప్పటివరకు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు. అమెరికాలో కొత్త పార్టీని స్థాపించడం అంత ఇజీ కాదు. ప్రతి రాష్ట్రంలోనూ కఠినమైన నిబంధనలు, లక్షలాది సంతకాల సేకరణ వంటి సవాళ్లు ఉంటాయి. మస్క్ వద్ద అపారమైన సంపద ఉన్నప్పటికీ, 'డువర్జర్ సూత్రం' ప్రకారం రెండు పార్టీల వ్యవస్థ బలంగా ఉన్న దేశంలో మూడో పార్టీ ఓట్లను చీల్చడానికే పరిమితమవుతుందని, గెలుపువడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు.