జగన్ కాన్వాయ్ వాహనం ఢీ కొని వృద్ధుడు మృతి
posted on Jun 18, 2025 2:52PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో ఆయన కాన్వాయ్ లోని వాహనం ఢీ కొని ఓ వృద్ధుడు మరణించాడు. గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటనకు జగన్ బుధవారం (జూన్ 18) భారీ కాన్వాయ్ తో తాడేపల్లి నుంచి బయలుదేరారు. ఆయన కాన్వాయ్ ఏటుకూరు బైపాస్ వద్దకు చేరిన సమయంలో ఆ బైపాస్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వృద్ధుడిని జగన్ కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీ కొట్టింది.
దీంతో ఆ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వృద్ధుడిని స్థానికుల సమాచారం మేరకు వచ్చిన 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించారు. వృద్ధుడిని ఢీ కొట్టినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు జగన్ పైనా, వైసీపీపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ స్వార్థ రాజకీయానికి ఓ నిండు ప్రాణం బలైందంటూ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్ లోని వాహనం వృద్ధుడిని ఢీ కొట్టిందనీ, అయినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. కాన్వాయ్ ని ఆపి గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉంటే ఆయన బతికి ఉండేవాడనీ గొట్టిపాటి అన్నారు. జగన్ వన్నీ మోసపూరిత వాగ్దానాలు, మాటలూ అని గొట్టిపాటి విమర్శించారు.