గాలికి ఈడి షాక్: 884 కోట్ల ఆస్తుల జప్తు

 

 

అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కి ఈ డి గట్టి షాక్ ఇచ్చింది. 884 కోట్ల రూపాయల మేర అక్రమ మైనింగ్ కు పాల్పడ్డాడని తీర్మానించిన ఈ డి దానికి సమానమైన ఆస్తులను బ్రహ్మణీ స్టీల్స్ నుండి జప్తు చేసింది.


సిబిఐ దాఖలు చేసిన మొదటి చార్జ్ షీట్ ఆధారంగా ఈ డి ఈ జప్తులను చేసింది. అక్రమ మైనింగ్ తో పాటు, ఫెమా నిభందనలు ఉల్లంఘించడం కూడా ఈ డి తీసుకొన్న ఈ చర్యకు కారణంగా తెలుస్తోంది. బ్రహ్మణీ స్టీల్స్ కు చెందిన 88 కోట్ల 41 లక్షల 30 వేల షేర్లు, హెలికాప్టర్ జప్తు చేయబడిన వాటిలో ఉన్నాయి. ఈ ప్లాంటుకు చెందిన భూములు, అనేక రకాల యంత్ర సామగ్రి అమ్మడం, వేరొక చోటకు తరలించడం, లీజుకు ఇవ్వడం చేయరాదని ఈ డి ఆదేశించింది.



ఓబులాపురం కేసులో బెంగుళూరు జోనల్ యూనిట్ ఈ డి అధికారులు దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. కేసు విచారణ అంచలంచలుగా కొనసాగుతుందని ఈ డి అధికారులు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ కి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఆస్తుల జప్తుతో గాలి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఒక సమయంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన గాలి ప్రస్తుత సంక్షోభం నుండి ఎలా గట్టేక్కుతాడో వేచి చూడాల్సిందే.