హరీష్ రావు, రేవంత్ రెడ్డికి షాకిచ్చిన ఈసీ

 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, ప్రజకూటమి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ మధ్య నలుగురు నేతలు మాటల హీట్ పుట్టిస్తున్నారు. వారే హరీష్ రావు, రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, రేవూరి ప్రకాష్‌ రెడ్డి‌. హరీష్ రావు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తుంటే.. రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నారు. ఇక వంటేరు ప్రతాప్ రెడ్డి, రేవూరి ప్రకాష్‌ రెడ్డి‌ అయితే హరీష్ రావు ని టార్గెట్ చేస్తూ టీఆర్‌ఎస్‌ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కొన్నిసార్లు ఈ విమర్శలు శృతిమించుతున్నాయి. పరుష పదజాలంతో  తీవ్రమైన విమర్శలు ఈ నలుగురు నేతలకు తాజాగా ఈసీ షాకిచ్చింది. వారు చేసిన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ సీఎం చంద్రబాబుపై హరీష్‌రావు  అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు  ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టీఆర్ఎస్‌ నేతలతో పాటు  కేసీఆర్‌ను తీవ్రమైన పదజాలంతో దూషించినందుకు రేవంత్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, రేవూరి ప్రకాష్‌ రెడ్డి‌లకు ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లో ఈ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది.