ఏపీలో ల్యాప్‌టాప్, సర్వర్ తయారీ యూనిట్: లోకేష్ ప్రతిపాదనకు డిక్సన్ టెక్నాలజీ సానుకూల స్పందన.!
Published on: Fri Nov 13, 2026 10:22AM

ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరర్ డిక్సన్ టెక్నాలజీస్ రాష్ట్రంలో కొత్తగా 700 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. మంత్రి నారా లోకేష్‌తో ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఓఓ పంకజ్ శర్మ విశాఖలో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వేదికగా ఈ పెట్టుబడి పెట్టేందుకు పంకజ్ శర్మ సానుకూలత వ్యక్తం చేశారు. ఈ నూతన ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 2300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. భారతదేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన డిక్సన్ తిరుపతి హబ్‌తో పాటు, కడప జిల్లా కొప్పర్తిలోనూ తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మరింత బలోపేతం చేసేందుకు డిక్సన్ ఇన్వెంటెక్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లు, సర్వర్ల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పాలని లోకేష్ ఆహ్వానించారు. ఐటీ హార్డ్‌వేర్ తయారీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో డిక్సన్ టెక్నాలజీస్ ప్రస్థానాన్ని, భవిష్యత్తు ప్రణాళికలను సంస్థ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ ఈ సందర్భంగా వివరించారు. 2018 నుంచే తిరుపతిలో తమ సంస్థకు దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ తయారీ ప్లాంట్ ఉందని, ఇన్ హౌస్ ఎల్‌సీఎం లైన్‌తో షియోమి సహా పలు ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులను ఇక్కడి నుంచే తయారు చేస్తున్నామని తెలిపారు. దీనికి తోడు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఏఐఎల్ డిక్సన్ యూనిట్‌ను 450 కోట్ల రూపాయల వ్యయంతో విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విస్తరణ ద్వారా అదనంగా ఏడు వేల మందికి ఉపాధి దక్కనుందని, ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం లభించిందని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ముందుంచిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సర్వర్ల తయారీ ప్రతిపాదనలు ఆకర్షణీయంగా ఉన్నాయన్న పంకజ్ శర్మ, ఈ అంశాలపై తమ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో క్షుణ్ణంగా చర్చించి, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి అందుతున్న ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కోకో సాగుకు కొత్త ఊపు.. మోండెలేజ్‌తో సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన.!
తిరుపతి మరియు కొప్పర్తి వంటి ప్రాంతాలలో డిక్సన్ వంటి దిగ్గజ సంస్థల విస్తరణ వల్ల రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుంది. కేవలం అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా, కీలక విడిభాగాల తయారీ మరియు ఐటీ హార్డ్‌వేర్ యూనిట్లు కూడా రాష్ట్రానికి తరలివస్తే స్థానిక ఇంజనీరింగ్, సాంకేతిక నిపుణులకు సొంత గడ్డపైనే ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ పెట్టుబడుల ఒప్పందాలు త్వరలోనే కార్యరూపం దాల్చి ఉత్పత్తి ప్రారంభమవుతుందని పారిశ్రామిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద విశాఖ వేదికగా జరుగుతున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్రంలో పెట్టుబడుల ఆంచనాలను అందుకునే దిశగానే సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: ఏపీకి కియా భారీ పెట్టుబడులు.. పెనుకొండలో మరో ప్లాంట్.!
ఇన్వెస్టర్ల కార్పొరేట్ హోం ఏపీ: ఐసీసీ సదస్సు వేదికగా లోకేష్ ప్రకటన.!
[DixonTechnologies, InvestmentAP, Nara Lokesh, Tirupati EMC2, TeluguOne]


