వైసీపీలో పెరుగుతున్న రఘురామ రాజులు..! పార్టీలో నివురు తొలగిన అసమ్మతి, అసంతృప్తి

వైసీపీలో అసమ్మతి రాజుకుంటోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఇంత కాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, అసమ్మతి ఇప్పుడు రాజుకుని మంటగా మారుతోంది. పార్టీకి హైకమాండ్ అంటే  అధినేత జగన్ మాత్రమే. అసమ్మతి ఇప్పుడు అధినేతను ధిక్కరించడానికి సైతం వెనుకాడని పరిస్థితి కనిపిస్తోంది. ఇంత కాలం వైసీపీలో అసమ్మతి అంటూ ఎవరైనా బహిరంగంగా బయటకు వచ్చారంటే అది రెబల్ ఎంపీ రఘురామ రాజు మాత్రమే.

ఆయన ధిక్కారాన్ని సహించలేని అధినేత జగన్ ఆయన పట్ల వ్యవహరించిన తీరు తెలిసిందే. ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి భౌతికంగా హింసించారంటే దాని వెనుక ఉన్నది ఎవరో ఎవరైనా తేలిగ్గా ఊహించగలరు. ధిక్కారాన్ని, అసమ్మతి స్వరాన్ని అధినేత సహించడని స్పష్టంగా తెలిసినా కూడా పార్టీలో అసమ్మతి గళం పైకి లేస్తున్నదంటే పార్టీలో అసంతృప్తి ఎంతగా పేరుకుపోయిందో ఇట్టే అవగతమౌతుంది.

తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తన నిరసనను పార్టీ అధినేతకు దిమ్మతిరిగేలా వినిపించారు. గత కొంత కాలంగా ఆయన సుతిమెత్తగా తన అసమ్మతిని, అసంతృప్తినీ వ్యక్త పరుస్తూనే ఉన్నారు. అయితే మంగళవారం ఆయన తన నిరసనను వ్యక్తం చేసిన తీరు పార్టీ వర్గాలనే దిగ్భ్రమకు గురి చేసింది. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన నేరుగా డ్రైనేజీలోకి వెళ్లి కూర్చున్నారు.   నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో డ్రైనేజీ పనులకు నిధులు కేటాయించడం లేదనీ, కార్పొరేషన్ అధికారులు ఎమ్మెల్యేనైన తన మాటలు వినడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా..  ఎమ్మెల్యేగా తాను కోరుతున్నా డ్రైనేజీ పనులకు నిధులు కేటాయించడం లేదంటే ఏమనుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.  

ఎమ్మెల్యే  నిరసనకు  సంఘీ భావంగా ఆయన అనుచరులు కూడా డ్రైనేజీలోకి దిగారు. ఈ మొత్తం  సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకు పెద్ద చర్చకు శ్రీకారం చుట్టింది.  రోడ్లు, డ్రైనేజీలు వంటి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనూ కూడా ఇటువంటి పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదనీ, ఇది అందరికీ తెలిసిన విషయమేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఎమ్మెల్యే కోటం రెడ్డి ఇలా బహిరంగ నిరసనకు దిగడం పార్టీని ప్రజలలో పలుచన చేయడానికేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తికి తోడు, తనతో అంతగా సఖ్యత లేని కాకాణికి మంత్రిపదవి ఇవ్వడంతో పెచ్చరిల్లిన అసహనంతో గత కొద్ది కాలంగా కోటం రెడ్డ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  అయితే ఒక్క కోటం రెడ్డే కాదు.. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులూ కూడా బహిరంగంగానే పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రకటనలూ ప్రసంగాలూ చేస్తున్నారు. ఇటీవల బొత్స కూడా విజయనగరం జిల్లాలో ప్లీనరీ సదస్సులో మాట్లాడుతూ పార్టీ క్యాడర్ నాయకత్వం మీద విశ్వాసం కోల్పోతోందనీ, వారు పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారనీ చెప్పడమే కాకుండా ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని కుండ బద్దలు కొట్టారు. అంతకు ముందు సమీక్షా సమావేశంలోనే బాలినేని వంటి నేతలు పార్టీలో అసమ్మతి, పనులు జరగకపోవడంతో ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహం గురించి అధినేత ఎదుటే గళమెత్తారు.  

ఇక జోగి రమేష్ అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల సమక్షంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి ఈ రోజు వైసీపీలోనే ఉన్నా ముందు ముందు ఉంటారన్న నమ్మకం లేదని అన్నారు.    మాజీ మంత్రి బాలినేని విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆయన పలు సందర్భాలలో బహిరంగంగా చెప్పారు.

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అయితే గన్నవరం, బందర్ నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించేసి ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే ఉన్న గ్రూపు తగాదాలకు అజ్యం పోశారు. ఇలా ఇక్కడ ప్రస్తావించిన జిల్లాలలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీలో గ్రూపు తగాదాలు శృతి మించి రాగానపడ్డాయని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.  పరిస్థితి ఇలాగే కొనసాగితే నియోజకర్గానికి ఒక రఘురామరాజు తయారైనా ఆశ్చర్యపోవలసిన పని లేదని పరిశీలకులే కాదు, వైసీపీ శ్రేణులు సైతం అంటున్నాయి.