నిషేధిత ఆస్తుల జాబితాలో 20 లక్షల ఎకరాలు.. ఇదేందయ్యా కేసీయారూ! 

తెలంగాణలో రెవిన్యూ సంస్కరణల గురించి గంభీర వచనాలు వల్లించిన కేసీఆర్.. ఆ మాటలు చెప్పి రెండేళ్లు కావస్తున్నా రాష్ట్ర ప్రజల సమస్యలకు పరిష్కారం మాత్రం చూపించలేకపోయారు. అనేక దఫాలుగా ఎన్నో గంటలపాటు సమావేశాలు జరిపి తయారు చేసిన మార్గదర్శకాల మేరకు అధికారులు పని చేయలేకపోతున్నారా.. లేక మార్గదర్శకాలు, పని విభజనే అశాస్త్రీయంగా ఉందా.. అదీగాక అధికారులు తమ పాత పద్ధతిలోనే లంచాల సంస్కృతిని మరింత పెంచి పోషిస్తూ భూముల లావాదేవీల్లో కొర్రీలు వేస్తున్నారా అన్న విమర్శలకు ఇప్పుడు బలం పెరిగింది. ఇందులో అధికారుల లోపం ఉందా.. ప్రభుత్వం చేతగానితనం ఉందా అనేది కాసేపు పక్కనపెడితే.. ఇప్పటికీ 20 లక్షల ఎకరాల ప్రైవేట్ పట్టా ల్యాండ్ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉండడమే అందుకు ఓ నిదర్శనంగా చెబుతున్నారు విపక్ష పార్టీల నేతలు. 

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిషేధిత ఆస్తుల జాబితా రైతుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్, అసైన్డ్ ల్యాండ్స్ ఉండాల్సిన ఈ లిస్టులో లక్షలాది మంది అసలైన పట్టాదారుల సర్వే నెంబర్లు నమోదయ్యాయి. అధికారులు చేసిన తప్పులు.. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో  దాదాపు 20 లక్షల ఎకరాల పట్టా ల్యాండ్స్ నిషేధిత ఆస్తుల చిట్టాలో చిక్కుకున్నాయి. దీంతో అసలు సిసలైన యజమానులు తమ భూములను అమ్ముకోలేక.. కుటుంబీకులకు మ్యుటేషన్ చేసుకోలేక తిప్పలు పడుతున్నారు.

కొన్ని జిల్లాల్లో ఫ్రీడమ్ ఫైటర్లు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు ఈ జాబితాలో ఉండటం రెవిన్యూ రికార్డుల్లోని తప్పులను వేలెత్తి చూపుతోంది. తమ దగ్గర పట్టాదారు పాసు పుస్తకాలున్నాయని.. తమ  భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితులు ఏళ్లకేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జిల్లా అధికారుల నుంచి ఎన్వోసీ తెచ్చుకోవాలని.. అప్పుడే ఆ జాబితా నుంచి భూములు తొలగిస్తామని రెవిన్యూ సిబ్బంది ఉచిత సలహాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు చేసిన తప్పులకు తాము బలవుతున్నామని, ఎన్వోసీ తెచ్చుకునేందుకు లంచాల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. గతంలో హైదరాబాద్ ను ఆనుకునే ఉన్న ఓ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ ఏసీబీకి చిక్కింది కూడా ఇలాంటి కేసులోనే కావటం గమనార్హం.

అంతేకాదు.. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చిన భూములపైనా క్లారిటీ లేకుండా నోషనల్ ఖాతాలకే పరిమితం చేశారు. దీనివల్ల లబ్ధిదారులకు నష్టపరిహారం సైతం ఇంకా అందకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రీడం ఫైటర్లు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములు కూడా ప్రొహిబిటెడ్ జాబితాలోకి వెళ్లిపోయి అభివృద్ధి చేసుకోవాలన్నా లేక అవసరం మేరకు అమ్ముకోవాలన్నా, మరేదైనా ఇతర అవసరాలకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో పిల్లల చదువులైనా, పెళ్లీడుకొచ్చిన పిల్లలకైనా ఉపయోగపడకుండా పోయాయి. అసలు ఇలాంటి భూములకు రిజిస్ట్రేషన్ల శాఖ సింపుల్ గా రెడ్ మార్క్ పెట్టి కూర్చోవడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే నిషేధిత జాబితా నుంచి తమ భూములు తీసేయాలని ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటికే 60 వేల  మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరంతా ఎన్వోసీ కోసం రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

అటు అధికారులు భూముల విలువను బట్టి ఎన్వోసీ కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. రెవిన్యూ అధికారుల మీద బాధిత ప్రజలు దాడులు చేస్తున్నా లంచావతారులకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటికైతే పరిష్కారం దక్కలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగానైనా ఈ ప్రజోపయోగ కార్యక్రమాన్ని పట్టాలకెక్కిస్తారా అంటున్నారు సామాన్య జనం.