కోడెల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ: కిషన్ రెడ్డి

 

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తమకు ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను చేతిలోకి తీసుకోకూడదని హితవుపలికారు. ఏపీ పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని తమకు కొందరు ఫిర్యాదులు చేశారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలబడే వ్యక్తి.. ఇలా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవడంపై తమకు అనుమానాలున్నాయని పలువురు టీడీపీ నేతలు తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. కోడెల మృతిపై తాను రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలు తెప్పించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కోడెల మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామన్నారు.