ఇండియా కూటమిలో డీలిమిటేషన్ చిచ్చు: చీలిక దిశగా అడుగులు.. కాంగ్రెస్ కు బిగ్ షాక్.!
Published on: Sat Nov 28, 2026 11:21AM

డీలిమిటేషన్ ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికకు దారి తీస్తోందా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచేందుకు, రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని స్థిరంగా ఉంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలపై ఇండియా కూటమిలోభిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతుండటమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇండియా కూటమి ఐక్యత ప్రశ్నార్థకంగా మారింది.
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో, సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచడం, పాతికేళ్ల పాటు సీట్ల వాటా నిష్పత్తిని స్తంభింపజేయడం వంటి అంశాలు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలలో బిల్లుకు అనుకూలత వ్యక్తం అయ్యేలా చేసింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమ రాష్ట్ర సీట్ల వాటా తగ్గకూడదని, 1971 జనాభా ప్రాతిపదికన నిష్పత్తిని కొనసాగించాలని అలాగే సీట్ల వాటా పతికేళ్లు స్థిరంగా ఉంచాలన్న డిమాండ్ కు తన తాజా ప్రతిపాదన ద్వారా కేంద్రం అంగీకరించినట్లైంది. దీంతో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిలబడాలన్న ఆ పార్టీ వైఖరిలో మార్పు చోటు చేసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఇక ఇప్పటికే ఎన్సీపీ (శరద్ పవార్ ) నేతలు బిల్లు పూర్తి స్వరూపాన్ని చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఆ పార్టీ ఎన్డీయేకు జై కొట్టడం ఖాయమని తేటతెల్లమైపోయింది.

కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును, ప్రత్యేక సమావేశాల నిర్వహణను బలంగా వ్యతిరేకిస్తోంది. మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజనను ముందుకు తీసుకెళ్లడం రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెస్ అంటోంది. పునర్విభజన బాధ్యతల నిర్వహణ, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత, అలాగే రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీని సమీకరించే తీరుపై కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితే ఇండియా కూటమిలో చీలిక అనివార్యం అన్న భావన కలిగిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఇండియా కూటమి కీలక నిర్ణయం...ఇకపై రెండు నెలలకు ఒకసారి భేటీ!
గతంలో ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించక ఆమోదం పొందని విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ ఆ బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించడానికి ఇండియా కూటమిలో చీలిక ఆశతోనే నని అంటున్నారు.

మొత్తంగా చూస్తే, డీలిమిటేషన్ బిల్లు ప్రతిపక్ష కూటమిలోని భిన్న రాజకీయ ఆలోచనలు, ప్రాంతీయ ప్రయోజనాల మధ్య ఉన్న తేడాలను మరోసారి బట్టబయలు చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో జరిగే పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది.
మీకు నచ్చవచ్చు: ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.!
[Delimitation Effect, India allience, Split, Shock, Congress, TeluguOne]


