TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

డీలిమిటేషన్ బిల్లు: ఆమోదం కోసం కేంద్రం వ్యూహాలు.!

Published on: Sat Nov 28, 2026 9:43AM

డీలిమిటేషన్పై నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు  దాదాపుగా తెరపడింది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని కేంద్రం లోక్‌సభ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో దామాషా ప్రకారం 50 శాతం పెంచేందుకు నిర్ణయించింది. దీంతో దేశంలో లోక్ సభ స్థానాలు 850కి చేరతాయి. అంతే కాదు వచ్చే పాతికేళ్ల వరకూ  అంటే 2051 వరకు రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపును స్థిరంగా ఉంచే ప్రతిపాదనకు సైతం కేంద్రం ఆమోదముద్ర వేసింది.  దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు దాదాపుగా పరిష్కారం అయిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సోమవారం (నవంబర్ 30) ప్రారంభమయ్యే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్డానికి కేంద్రం రెడీ అయ్యింది. 

 కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 

దీనితో పాటు  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు కూడా ఉంటుంది.  గతంలో జరిగిన పరిణామాలను అవలొకిస్తే.. లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను చివరిసారిగా 1970వ దశకంలో, 1971 జనాభా లెక్కల ఆధారంగా 543 స్థానాలకు పరిమితం చేశారు   ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజనను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 131వ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు, జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే ఉత్తరాదిలో సీట్లు భారీగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందంటూ ప్రతిపక్షాలు  వ్యతిరేకించడంతో ఆ బిల్లు ఆమోదం పొందలేకపోయింది.

మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ లోక్‌సభలో తమ రాష్ట్రానికి ఉన్న 7.18 శాతం సీట్ల వాటాను ఏ మాత్రం తగ్గించరాదని  డిమాండ్ చేశారు. 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల మధ్య ఉన్న సీట్ల నిష్పత్తిని మరో పాతికేళ్ల   పాటు యథాతథంగా కొనసాగించాలని, ఈ అంశంలో రాజీ పడే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సీట్ల ఏకరీతి పెంపు, పాతికేళ్ల స్తంభన ప్రతిపాదనలు దక్షిణాది ముఖ్యంగా స్టాలిన్ లేవనెత్తిన అభ్యంతరాలకు అనుగుణంగా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.?

ఇకపోతే.. ఈ ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి పెను సవాలేననడంలో సందేహం లేదు. రాజ్యాంగ సవరణకు ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కాగా, లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాలంటే.. ప్రస్తుత సంఖ్యలను బట్టి  358 మంది సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఎన్డీఏ కూటమికి   319 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉందని అంచనా.  అయితే  లెక్కల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)కి చెందిన 8 మంది ఎంపీలు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల వైఖరి   కీలకంగా మారింది.  రాష్ట్రాల సీట్లను ఏకరీతిగా 50 శాతం పెంచాలని ఈ రెండు పార్టీలు గతంలో డిమాండ్ చేయగా, ఇప్పుడు కేంద్రం ఆ ప్రతిపాదనకు అంగీకరించిన నేపథ్యంలో వాటి ఓటింగ్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు పార్టీల ఎంపీలు మద్దతు ఇస్తే ఎన్డీఏ మెజారిటీకి   దగ్గరయ్యే అవకాశం ఉన్నా, కూడా మూడింట రెండొంతుల మంది మద్దతుకు ఇంకా దూరంగానే నిలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొందరు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉంటే రాజ్యాంగ సవరణ అవసరమయ్యే డీలిమిటేషన్ బిల్లు ఆమోద ప్రక్రియ సులభతరం కావచ్చని పరిశీలకులు అంటున్నారు. 

రానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చర్చలు, సవరణల ప్రతిపాదనలు, వివిధ పార్టీల  వైఖరులు స్పష్టమయ్యే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల వాటా పరిరక్షణ, 25 ఏళ్ల స్థిరత్వ హామీ, మహిళా ప్రాతినిధ్య అంశాలపై పార్లమెంట్ లోపల, వెలుపల విస్తృత చర్చలు సాగుతాయనడంలో సందేహం లేదు.  మొత్తంగా చూస్తే, 50 శాతం సీట్ల పెంపు మరియు 25 ఏళ్ల స్తంభన ద్వారా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను చల్లార్చుతూనే రాజ్యాంగ సవరణకు అవసరమైన మద్దతు కూడగట్టే వ్యూహాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్‌ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్‌ గొగోయ్‌ విమర్శలు

డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్యం స్థిరం.!

[Delimitation Bill,   LokSabha seats, ncrease,   25year freeze, Southstates, demand, TrluguOne]