డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.?
Published on: Fri Nov 27, 2026 4:06PM

145 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒకే ఎంపీ 30 లక్షలకు మించిన ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దేశ జనాభా 1971తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగినప్పటికీ, రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల పంపిణీ మాత్రం యాభై ఏళ్లుగా పాత ప్రాతిపదికనే కొనసాగుతోంది. పట్టణీకరణ విస్తరిస్తుండటం, కొత్త ప్రాంతాలు రూపుదిద్దుకుంటుండటం, ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యవసరమన్న చర్చ దేశవ్యాప్తంగా జోరందుకుంటోంది. దేశ జనాభా, భౌగోళిక స్వరూపం, నివాస ప్రాంతాల్లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని, అవసరమైన చోట స్థానాల సంఖ్యను సమీక్షిస్తూ లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించడమే పునర్విభజన అదే డీలిమిటేషన్.
ఒక నియోజకవర్గంలో సుమారు పది లక్షల ఓటర్లు ఉండగా, మరొక నియోజకవర్గంలో ముప్పై ఐదు లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ ఇద్దరికీ ఒక్కో ఎంపీ మాత్రమే ప్రాతినిధ్యం వహించే అసమానతను వీలైనంత మేర తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలంగాణలోని మల్కాజ్‌గిరిలో సుమారు 37.80 లక్షలు, బెంగళూరు నార్త్‌లో 32.15 లక్షలు, ఘజియాబాద్‌లో 29.48 లక్షలు, చేవెళ్లలో 29.39 లక్షలు, గౌతమ్ బుద్ధ్ నగర్లో 26.81 లక్షలు, వెస్ట్ ఢిల్లీలో 25.92 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. మరోవైపు లక్ష కంటే తక్కువ ఓటర్లు ఉన్న లక్షద్వీప్‌కు కూడా ఒక ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పునర్విభజన వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు మెరుగైన ప్రాతినిధ్యం లభించడంతో పాటు ప్రజాప్రతినిధులపై జనాభా భారం తగ్గుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
నియోజకవర్గాల పరిమాణం, జనాభా మధ్య సమతుల్యత ఏర్పడితే స్థానిక సమస్యలను గుర్తించడం, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవడం మరింత సులభమవుతుంది. పెరుగుతున్న నగరాలు, కొత్త కాలనీలు, పారిశ్రామిక ప్రాంతాలతో పాటు గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల సమస్యలకు కూడా తగిన ప్రాధాన్యత, గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా 2023లో ఆమోదం పొందిన 106వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఈ పునర్విభజన ప్రక్రియ కీలకంగా నిలుస్తోంది. చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1952, 1963, 1973, 2002లలో నాలుగు పునర్విభజన కమిషన్లు ఏర్పాటయ్యాయి. 2002 కమిషన్ 2001 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను సవరించగా, దాని ఆదేశాలు 2008లో అమల్లోకి వచ్చాయి.

అయితే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల కేటాయింపును స్తంభింపజేశారు. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001లో 84వ రాజ్యాంగ సవరణ ఈ స్తంభన గడువును 2026 తర్వాత నిర్వహించే మొదటి జనాభా లెక్కల వివరాలు ప్రచురించే వరకు పొడిగించింది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అంశం ఈ ప్రక్రియలో కీలకమైన ప్రశ్నగా నిలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, విద్య, ఆరోగ్య రంగాలపై దృష్టి పెట్టి జనాభా వృద్ధిని అదుపులో ఉంచాయి. కేవలం జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన బలంగా వ్యక్తమవుతోంది. అందువల్ల మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచడం, జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాల ప్రాతినిధ్యానికి భంగం కలగకుండా సమతుల్యత సాధించడం వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు.
ఇది కూడా చదవండి: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలా నష్టం...అసలు వివాదం ఏంటి?
రాజకీయంగా, సామాజికంగా డీలిమిటుషన్ పై భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి నిర్ణయాల్లో ఏ రాష్ట్రానికి ఎంత ప్రాధాన్యత దక్కుతుంది. దీర్ఘకాలంలో ఏ ప్రాంతాలు లేదా పార్టీలు ఎలాంటి ప్రభావాన్ని ఎదుర్కొంటాయనే అంశంపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సమాఖ్య న్యాయం కోణంలో స్పందిస్తున్నాయి. విస్తరిస్తున్న మెట్రోపాలిటన్ ప్రాంతాలు, పట్టణ క్లస్టర్లు, మారుమూల గిరిజన ప్రాంతాల అవసరాలను గుర్తించాల్సిన అవసరం ఉండగా.. మీడియా చర్చలు మాత్రం తరచుగా ఉత్తరాది, దక్షిణాది అనే నినాదాలకే పరిమితమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 2027 జనాభా లెక్కల వివరాలు అధికారికంగా ప్రచురించబడిన తర్వాత, రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం పునర్విభజన ప్రక్రియ ముందుకు సాగుతుంది. మొత్తం సీట్ల సంఖ్య ఎంత ఉండాలి, రాష్ట్రాల మధ్య వాటి పంపిణీ ఎలా జరగాలి, జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకు ఎలాంటి రక్షణలు కల్పిస్తారనే మూడు ప్రధాన ప్రశ్నలే రానున్న చర్చలకు కేంద్ర బిందువులుగా మారనున్నాయి.

మారుతున్న భారతదేశానికి, పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరాలకు అనుగుణంగా ప్రాతినిధ్య వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అందరూ భావిస్తున్నారు. అదే సమయంలో సమాఖ్య స్ఫూర్తికి, ఏ ఒక్క రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా సమతుల్య పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతో ప్రజలు, విశ్లేషకులు తదుపరి పరిణామాల కోసం ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: ఈ నెలాఖరులో డీలిమిటేషన్ బిల్లు: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. పావులు కదుపుతున్న కేంద్రం.!
ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి ప్రధాని ఆహ్వానం: హస్తినకు చంద్రబాబు, పవన్.!
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
-సీతారాం కంఠంనేని
[delimitation constituencies necessary, 2027 Census, ఊarliamentary Representation, Southern States, TeluguOne]


