ఢిల్లీలో బలగాల కవాతు... 42కి పెరిగిన మృతులు...

ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నవారిలో పలువురు మృత్యువాత పడుతున్నారు. దాంతో, ఢిల్లీ అల్లర్ల మృత్యుల సంఖ్య 42కి చేరింది. ఇంకా, 200మందికి పైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. 

ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు పెద్దఎత్తున కవాతు నిర్వహించారు. వీధుల్లో మార్చ్ ఫాస్ట్ చేపట్టారు. అలాగే, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఓపీ మిశ్రా ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. భయం వద్దంటూ.. భరోసా కల్పించారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 48 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా, 130మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాస్తవను నియమించారు. తాము భద్రంగా ఉన్నామనే భావనను ప్రజల్లో కలిగించడమే తన ప్రధాన కర్తవ్యమని, వారిలో నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తానని శ్రీవాస్తవ వెల్లడించారు. మరోవైపు, ఢిల్లీలో పరిస్థితి కుదుటపడుతోందని, వదంతులను ఎవరూ నమ్మవద్దని ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.