లక్షా 65వేల కోట్ల అంచనాలతో తెలంగాణ బడ్జెట్.. లెక్కలు పక్కాగా ఉండాలన్న కేసీఆర్...

తెలంగాణ వార్షిక బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ రంగానికి ఎంత కేటాయించాలి? ఆదాయం పెంచుకునే మార్గాలేంటి? కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులెన్ని? ఇలా, అన్నింటిపై ఆర్ధికశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. అయితే, ఒకవైపు ఆర్ధిక మాంద్యం... మరోవైపు కేంద్రం నుంచి నిధులు తగ్గడంతో... వాస్తవిక లెక్కల ఆధారంగా బడ్జెట్‌ను తయారు చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు.

గతేడాది లోక్‌సభ ఎన్నికల కారణంగా లక్షా 82వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం... ఆర్ధిక మాంద్యం కారణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ అంచనాలను లక్షా 46వేల కోట్లకు కుదించుకుంది. అయితే, ఆర్ధిక మాంద్యం ఇంకా కొనసాగుతుండటం... మరోవైపు, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను 19వేల 718 కోట్ల నుంచి 15వేల 987 కోట్లకు తగ్గించడంతో ఆ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్రంగా పడుతోంది.అయితే, ఈసారి 10 నుంచి 12శాతం వృద్ధితో బడ్జెట్ రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ఆర్ధికశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు లక్షా 65కోట్ల అంచనాలతో ఈసారి బడ్జెట్ ఉంటుందని అంటున్నారు. రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటు దాదాపు 9.5శాతం ఉండటంతో, మిగిలిన లోటును కోకాపేటలో భూములను విక్రయించడం ద్వారా సమీకరించుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. భూముల విక్రయం ద్వారా దాదాపు 10వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోబోంది.

గతేడాది రాష్ట్రానికి ఇవ్వాల్సిన 19వేల 719కోట్లలో కేవలం, 10వేల 304కోట్లను మాత్రమే కేంద్రం ఇవ్వడంతో, ఆర్ధికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలా, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడుతుండటం, మరోవైపు ఇవ్వాల్సిన నిధులకు ఎగనామం పెడుతుండటంతో, వాస్తవ లెక్కల ఆధారంగా మాత్రమే బడ్జెట్‌ రూపకల్పన జరుగుతోంది.