సీఎం కేజ్రీవాల్‌ కి షాకిచ్చిన ఢిల్లీ పోలీసులు!!

 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కి ట్విట్టర్ వేదికగా పోలీసులు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందని.. 24 గంటల్లోనే ఢిల్లీలో ఐదు హత్యలు జరిగాయని, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, హోమంత్రిత్వ శాఖ ఇప్పటికైనా కళ్లు తెరవాలని కేజ్రీవాల్ ట్వీట్ లో పేర్కొన్నారు.
 
అయితే కేజ్రీవాల్ ట్వీట్‌పై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఐదు హత్యలు జరగడం నిజమేనని ఒప్పుకున్న పోలీసులు.. అవి లా అండ్ ఆర్డర్ సమస్యకు సంబంధించినవి కావనీ, వ్యక్తిగత కక్షలతో జరిగినవనీ తెలిపారు. నిందితులు-బాధితులు ఒకరికొకరు తెలుసని ట్వీట్ చేశారు. కొన్ని కేసుల్లో ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని, గతేడాదితో పోలిస్తే 10.5 శాతం తగ్గిందని పేర్కొన్నారు. మారణాయుధాలతో జరిగే హత్యల రేటు 5.65 శాతం, మహిళలపై నేరాల సంఖ్య 11.5 శాతం తగ్గిందని పోలీసులు తమ ట్వీట్‌లో వివరించారు.

మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉందంటూ ట్వీట్ చేసి కేజ్రీవాల్ కేంద్రానికి షాక్ ఇవ్వలనుకున్నారు. కానీ ఢిల్లీ పోలీసులు స్ట్రాంగ్ రిప్లై తో ఆయనకే షాకిచ్చారు.