సీఎం కాన్వాయ్ పై కర్రలతో దాడి

 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా దక్షిణ ఢిల్లీలో జరిగిన రోడ్‌షోలో ఓ వ్యక్తి కేజ్రీవాల్‌ చెంప చెళ్లుమనిపించారు. అంతకుముందు హర్యానాలో ఓ రోడ్‌షోలో కేజ్రీవాల్‌పై దాడిచేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించారు. అలాగే గత ఏడాది నవంబర్‌లో ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీఎం కార్యాలయం వెలుపల ఓ వ్యక్తి కేజ్రీవాల్‌పై కారం చల్లారు. తాజాగా  కేజ్రీవాల్‌ కాన్వాయ్‌పై కొందరు దుండగులు కర్రలతో దాడికి దిగారు. ఉత్తర ఢిల్లీలో 25 అనధికార కాలనీల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు కేజ్రీవాల్‌ వెళుతుండగా నరేలా ప్రాంతంలో దాడి జరిగింది. కేజ్రీవాల్‌ కారును ఆపేందుకు దాదాపు వంద మంది కర్రలతో ఆయన కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. సీఎం కారు అద్దాలు పగులగొట్టేందుకూ వీరు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, ఎస్కార్ట్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ దాడి నుండి కేజ్రీవాల్ సురక్షింతంగా బయటపడ్డారు. అలాగే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో..ఏ రాష్ట్ర సీఎంపై ఈ రేంజ్ లో దాడులు జరగలేదు. అలాంటిది ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ.. సీఎంపై ఇలా వరుస దాడులు జరగటం గమనార్హం.