కరాచీలోనే దావూద్.. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశాడు...!


1993 లో జరిగిన ముంబై పేలుళ్లో కేసులో ప్రధాన నిందితుడైన దావూద్ ఇబ్రహీం పాక్‌లో తలదాచుకున్నట్టు భారత్ ఎప్పటినుండో మొత్తుకుంటున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఐక్యరాజ్య సమితి సైతం దావూద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసింది. కానీ పాక్ మాత్రం దావూద్ తమ దేశంలో లేడని ఇప్పటికీ బుకాయిస్తున్నది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి పాక్ బుద్ది బయటపడింది. ఆయన కరాచీలోనే ఉన్నాడని.. దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం బాగాలేదని, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడని వచ్చిన వార్తలు నిజం కావని తేలిపోయింది. రెండు నెలల క్రితం నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ వివరాలను మీడియా తెలిపింది. సదరు న్యూస్ చానల్ కు చెందిన ఇన్వెస్టిగేషన్స్ విభాగం ఎడిటర్ మనోజ్ గుప్తా, దావూద్ ఇంటికి ఫోన్ చేయగా, స్వయంగా ఆయనే ఫోన్ లిఫ్ట్ చేశాడట. తనను పరిచయం చేసుకున్న తరువాత తాను జావేద్ చోటానీనని, దావూద్ ఇబ్రహీం దుబాయ్ లో వ్యాపారాలు చూసుకుంటున్నాడని చెప్పాడట. ఆ సమయంలో పక్కనే ఉన్న దావూద్ ఏం మాట్లాడాలన్న విషయాన్ని చోటానీకి స్వయంగా వివరిస్తున్నట్టు తనకు తెలిసిందని మనోజ్ గుప్తా వెల్లడించారు. అంతేకాదు తన మాఫియా ముఠా ద్వారా దుబాయ్ నుండి వ్యాపారాలు కొనసాగిస్తున్నాడని తెలిపారు. మరి దీనిపై పాక్ ఎలా స్పందిస్తుందో చూద్దాం.