మేమెంతో మాకంత అయ్యే పనేనా?
posted on Jun 18, 2025 7:04AM

తెలంగాణలో కులం కుంపట్లు రాజుకుంటున్నాయా? ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణలుగా మారి పోతున్నాయా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. బీసీ కులగణన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మేమెంతో మాకంత (జనాభా ప్రాతిపదికన పదవుల పంపకం) నినాదం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు మేలు చేస్తుందో ఏమో కానీ, రాష్ట్రంలో రెంటికి చెడిన రేవడి చేస్తుందా అనే మీమాంస కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.
ముఖ్యంగా.. ఇటీవల చేపట్టిన మంత్రివర విస్తరణలో రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడం.. అలాగే, పీసీసీ కార్యవర్గంలో ముందెన్నడూ లేని విధంగా సింహా భాగం (68) శాతం పదవులు ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు ఇవ్వడంతో.. కాంగ్రెస్ పార్టీకి హక్కుదారులం అనుకునే రెడ్డి సామాజిక వర్గంలో అసంతృప్తి మొదలైందని అంటున్నారు. కేవలం పదవులు ఆశించి భంగ పడిన నాయకుల్లోనే కాదు.. ఇప్పటికే పదవుల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నాయకుల్లోనూ రేపటి గురించిన గుబులు, తమ రాజకీయ భవిష్యత్ గురించిన ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది.
సామాజిక న్యాయం మంచిదే కానీ, సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకులు దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలిచిన తమ సామాజిక వర్గాన్ని పూర్తిగా ఉపేక్షించడం, మరీ పూచిక పుల్లలా తీసి పారేశారన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళడం పార్టీకి మంచిద కాదని అంటున్నారు. నిజానికి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే కాదు.. కాంగ్రెస్ అభిమానులు, విశ్లేషకులలోనూ అదే మాట విన వస్తోంది.
అయితే.. ఇప్పటికిప్పుడు తొందర పడితే ప్రయోజనం ఉండదని, స్థానిక ఎన్నికల తర్వాత మంత్రి వర్గంలో మిగిలిన మూడు ఖాళీల భర్తీతో పాటుగా, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అంటున్న నేపధ్యంలో ఆ క్రతువు కూడ పూర్తయ్యే వరకు ఆగుదామని, రెడ్డి నాయకులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మరో వంక, పార్టీకి దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్న కులగణన, బీసీ, ఎస్సీలకు మంత్రి పదవులు, పీసీసీలో బడుగులకు పెద్ద పీట..వంటి నిర్ణయాలను అమలు చేసిన రాష్ట్ర నాయకత్వం, చేసిన మంచిని చెప్పుకోవడంలో వెనక పడిందని అంటున్నారు. నిజానికి.. ఒక విధంగా బలవంతపు బ్రాహ్మనార్ధం అన్నట్లుగా.. అధిష్టానం ఆదేశాలను పాటించిన రాష్ట్ర నాయకత్వం బడుగులకు జరిగిన మేలును జనంలోకి తీసుకెళ్ళే విషయంలో అంతగా శ్రద్ధ చూపడం లేదని అంటున్నారు. ఫలితంగా, ఆశించిన రాజకీయ ప్రయోజనం ఏ మేరకు దక్కుతుందనే విషయంలో అనుమానాలు ఆందోళనలు వ్యక్తమవుతునాయి.
మరో వంక.. కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రకుల పేదలకు అన్యాయం చేస్తున్నదనే ఆందోళన పురుడు పోసుకుంది. ఈ నేపధ్యంలోనే.. ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్ర కుల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి తెలంగాణలో ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కమిషన్ ఏర్పాటుతో పాటు ఈబీసీల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే.. బడుగుల్లోనూ మున్నూరు కాపు, లంబాడ సహా ఇంకా మంత్రివర్గంలో స్థానం, పార్టీ పదవులు దక్కని కులాలు చాలానే ఉన్నాయి. దీంతో.. ఆ వర్గాల వారు మామాటేంటని అడుగుతున్నారు. అలాగే.. ముస్లిం మైనారిటీలు.. ఇతర మైనార్టీ వర్గాలు కూడా. దీంతో.. మేమెంతో మాకంత నినాదం ఆచరణ సాధ్యమేనా? అనే అనుమనాలు వ్యక్తంవుతున్నాయి. అనుమానాలు కాదు, సాధ్యం కాదని కూడా అంటున్నారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీకి పట్టు కొమ్మగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటే, దీర్ఘ కాలంలో పార్టీ నష్టపోతుందని అంటున్నారు. ఒక విధంగా.. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్లు అవుతుందా అనే అనుమానాలు, అపశ్రుతులు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.