అనుక్షణం గతిని మార్చుకుంటున్న"హెలెన్''!

 

 

 

ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఒక్కసారిగా ఎదుర్కొంటున్ననన్ని ఉపద్రవాలు ఇంతకు ముందెన్నడూ ఎదుర్కొని ఉండలేదంటే అతిశయోక్తి కాదు! ఈ ఉపద్రవాలలో కొన్ని ఇటీవల మాసాలలో వరసగా వచ్చిన పెనుతుఫానులు కాగా, తెలుగువాళ్ళు తమకు తాముగా ప్రకృతినిమించిన గాడితప్పిన 'ప్రవృత్తి'వల్ల తెలుగుజాతినే ముమ్మరించిన అనర్థదాయకమైన కృత్రిమ 'తుఫాను'లూ! మొన్నటి దాకా "ఫైలిన్'' తుఫాను రాష్ట్రవ్యాపితంగా ప్రజలను, పంటలను దెబ్బతీసింది. అది ముగిసీ ముగియకముందే సరికొత్త తుఫాను "హెలెన్'' ఆకస్మికంగా ముంచుకొచ్చింది. అంతకుముందు మన ప్రసిద్ధ వాతావరణ శాస్త్రవేత్తలుసహితం ప్రక్రుతి వైపరీత్యాలకు సంబంధిన సమాచారం గురించి కొన్ని సందర్భాలలో శాస్త్రయుక్తంగా హెచ్చరించటంలో విఫలమైనప్పటికీ, ఇటీవల కాలంలో ప్రపంచ శాస్త్రవేత్తలు పెక్కు ఆధునిక ఉపగ్రహాల సహాయంతో అందించగల్గుతున్న వాతావరణ సమాచారం మాత్రం చాలావరకు విశ్వసనీయంగా ప్రజలను, ప్రభుత్వాలను సకాలంలో హెచ్చరించడం సాధ్యమవుతోంది.


 

అయినా ప్రకృతి వైపరీత్యాల గురించి సకాలంలో సమాచారాన్ని శాస్త్రవేత్తలు అందించడంలో యిప్పటికీ అరుదుగానైనా విఫలం కావడానికి కారణం - అటు అంతరిక్షంలోనూ, ఇటు భూమిమీదా అగ్రరాజ్యాలు పరస్పరం పోటాపోటీలమధ్య హద్దులు మీరిన ఆబ కొద్దీ స్వలాభాపేక్షతో వాతారణ కాలుష్యానికి దోహదపడే అనుపాటవ పరీక్షలనూ, పరిసరాల విధ్వంసాన్ని కొనసాగిస్తూ రావడం వల్ల ప్రకృతిలో మానవుల ఉనికికే ప్రమాదం కల్గించే విరుద్ధ మార్పులకు దోహదం చేయడం! ఈ విపత్కర పరిణామం వల్లనే శాస్త్రవేత్తల, వాతావరణ శాస్త్ర సాంకేతిక ఉద్దండుల హెచ్చరికలను కూడా అధిగమించిపోయి వాతావరణ పరిస్థితులు ఆకస్మికంగా, క్షణాలమీద ప్రభావితం చేస్తూ తారుమారు చేస్తున్నాయి! ఈ దృశ్యమే ఇటీవల ప్రపంచ వ్యాపితంగానే కానవస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలుఖండాలలో, పెక్కు దేశాలలో వాతావరణం కేవలం తుఫానుల స్థాయిని దాటి, తరచుగా "సుడితుఫాను''లుగా (టాడోలు) జలాంతర్గత మందుపాతర్లుగా కూడా పనిచేస్తున్నాయి [ఈ దృశ్యాల్నే శ్రీశ్రీ "టార్నాడో, టార్పిడో/అది విలయం/ఇది సమయం'' అని అలంకార ప్రాయంగా వర్ణించాడు]!


ఈ వాతావరణ ప్రకృతి విలయదృశ్యాలకు శాస్త్రవేత్తలు వాటి ప్రత్యేకతను గుర్తించడానికి కొన్ని పేర్లను పెడుతుంటారు. వాటిలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను తాకి, పంటలకు, ప్రజలకూ భారీస్థాయిలో నష్టదాయకంగా పరిణమించిన ఉగ్రతుఫానులకు దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ పెట్టిన పేర్లు - లైలా, ఫైలిన్, హెలెన్, కత్రినా వగైరాలు! సహజమైన ప్రకృతి వైపరీత్యాలు కొన్నికాగా, పర్యావరణాన్ని తన స్వప్రయోజనాల కోసం కన్నూ మిన్నూ కానక్కుండా చేజేతులా మానవుడు సృష్టించుకుంటున్న విధ్వంసానికి రోజురోజుకీ అక్షరసత్యంగా నిరూపితమవుతున్న దృశ్యాలివి! పెట్టుబడిదారీ వ్యవస్థ కేవలం లాభార్జన ప్రాతిపదికపైననే ప్రకృతివనరులను వాతావరణాన్ని కొల్లగొడుతున్నంత కాలం వాతావరణ పరిస్థితులలో వినూత్నమైన ఆత్మాహుతికి దారితీసే వైపుగానే మానవుల్ని నడిపిస్తూంటుంది! వాతావరణంలో గత దశాబ్దాన్నర కాలంగా ఈ వినూతనమైన దృశ్యం - "పసఫిక్ ఫినామినా'' (పసఫిక్ మహా సముద్ర ప్రాంతంలో వచ్చిన ప్రత్యేక వాతావరణ మార్పులు. ఈ మార్పులవల్ల రెండు రకాల పరిణామాలు దూసుకువచ్చాయి!


(1) "ఎల్-నీనో'', (2) :లా-నీనా'' ఈ రెండు ప్రత్యేక వాతావరణ వ్యవస్థలలో ఒకటి తీవ్రదుర్భిక్ష పరిస్థితుల్ని, వడగాల్పుల్ని మరొకటి బిళ్ళబీటుగా విరుచుకుపడే తీవ్రాతి తీవ్రమైన పెనుతుఫానులనూ ఆకస్మింగా సృస్టిస్తాయి. ఈ వాతావరణ దృశ్యాలు కేవలం పసఫిక్ ప్రాంతదేశాలకే కాదు, చుట్టుపట్ల హిందూమహాసముద్ర ప్రాంత దేశాలను కూడా అతలాకుతలం చేసిగాని వదిలిపెట్టవు. నేడు మనం ఎదుర్కొంటున్న 'ఫైలాన్', 'హెలెన్' భీకర తుఫానులు అవేనని మరచిపోరాదు. క్రిస్మస్ పండగ సమయంలోనే, అదీ ఇంతకుముందు దాదాపు ఆరు-ఎనిమిది సంవత్సరాలకు వచ్చేది. కాని వాతావరణ మార్పుల వల్ల దాదాపు ప్రతి రెండు మూడేళ్ళకూ ఈ దృశ్యం దేశాలపైన "దాడు''లు చేస్తోంది. ఇప్పుడు దీని రాకడకూడా, "వాన రాకడ, ప్రాణం పోకడ తెలియద''న్న సామెతలానే మారిపోయింది! తాజా వచ్చిపడిన "హెలెన్'' భీకర తుఫాను మూడు కోస్తాంధ్ర జిల్లాలను, రెండు తెలంగాణా జిల్లాలనూ 100-130 మీటర్ల వేగంతో చుట్టబడుతూ ఉంది.
 


ఇటీవల మన శాస్త్రవేత్తలు అంగారకగ్రహానికి పంపించిన "మామ్'' భూమినుంచి 70,000 కిలోమీటర్ల దూరంనుంచి విస్పష్టమైన తోలి ఛాయాచిత్రాల్ని పంపించింది. ఇలాంటి వైజ్ఞానిక విజయాలను ఇండియా సాధించినకొద్దీ వాతావరణ మార్పుల గతివేగాన్ని ఫలప్రదంగా శాస్త్రవేత్తలు మరింత త్వరితంగా పసికట్టి ప్రజలకూ, రైతాంగానికి హెచ్చరికలూ, సేవలూ అందించగల్గుతారు. ఎందుకంటే, భూమి ఉపరితలంలో 71 శాతం ప్రాంతాన్ని సముద్రాలు, మహాసముద్రాలూ చుట్టివేశాయి. ఇందులో భూఖండం మీద ఉన్న జలరాశిలో 97 శాతం నీటిని మహాసముద్రాల (ఓషన్స్) ఆధీనంలో ఉన్నాయి! ప్రతిరోజూ ప్రపంచం చుట్టూ ఉరుములు మెరుపులతో కూడిన తుఫానులు 40,000 దాకా ఉంటాయని అంచనా! ఎలా యుద్ధరంగాన్ని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ యుద్ధ\రంగాలుగా (వెస్టరన్ ఫ్రంట్, ఈస్టరన్ ఫ్రంట్ లాగా) యుద్ధకాలంలో విభజిస్తారో - అలాగే వాతావరణ శాస్త్రజోస్యాల్ని కూడా విభాగిస్తారు. మొదటి ప్రపంచయుద్ధం తరువాతనే వాతావరణ శాస్త్ర జోస్యాల్ని మొదటిసారిగా అలా "యుద్ధరంగ'' స్థాయిలో విభజించారు! మూడులక్షల మంది ప్రజల్ని పొట్టన పెట్టుకున్న పెనుతుఫానుకు ఉదాహరనైన్తవరకు ఒక్క బంగానే మాత్రమే! మన పరిస్థితి - వానకు మండే వరద, అన్నట్టుగా ఉంది!