బాబు ఇంటికి మళ్లీ నోటీసులు.. ఖాళీ చేయక తప్పదా?

 

ఉండవల్లిలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంటి గోడకు అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని రమేష్‌ పేరుతో సీఆర్డీఏ నోటీసులు అంటించింది. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులనూ ప్రస్తుత నోటీసులో సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు.

గతంలో ఇచ్చిన సీఆర్డీఏ నోటీసులకు ఇంటి యజమాని రమేష్ వివరణ ఇచ్చారు. అయితే లింగమనేని రమేష్‌ వివరణ సంతృప్తికరంగా లేదని సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ లను నిర్మించారని తెలిపారు. ఈ నోటీసుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

కాగా, ఈ నోటీసుల వ్యవహారంపై లింగమనేని రమేష్ స్పందించారు. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామని తెలిపారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఉందని రమేష్‌ వెల్లడించారు.