తెలంగాణాలో కరోనా కాటుకు ఆరుగురు బ‌లి!

తెలంగాణలో కరోనా మరణాలు ఒక్కసారిగా ఆరుకు పెరిగాయి. ఈ ఆరుగురూ  త‌బ్లీక్ జ‌మాత్ హెడ్ క్వార్ట‌ర్ ఢిల్లీ మ‌ర్క‌జ్‌లో ఇస్త‌మా  కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది.  త‌బ్లీక్ జ‌మాత్ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల ఇస్త‌మా ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్కజ్ భ‌వ‌నంలో జ‌రిగింది. ఈ ఇస్త‌మాలో పాల్గొని వ‌చ్చిన వారిలో ఆరుగురు క‌రోనా పాజిటివ్‌తో మృతి చెందిన‌ట్లు తెలంగాణా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.  క‌రోనా పాజిటివ్ వ‌చ్చి తెలంగాణాలో మృతి చెందిన వారంతా త‌బ్లీక్ జ‌మాత్ ఇస్త‌మాకు వెళ్లి వ‌చ్చిన‌వారే. ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.  మృతుల్లో హైద‌రాబాద్ పాత బస్తీకి చెందిన జర్నలిస్ట్, ఓ మహిళ కూడా ఉన్నట్లు గుర్తించారు. 

తెలంగాణ నుంచి మొత్తం 280 మంది ఈ మూడు రోజుల ఇస్త‌మా కోసం ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారని తెలుస్తోంది. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 186 మంది వెళ్లగా.. నిర్మల్ 11, ఆదిలాబాద్ 10, నిజామాబాద్ 18, మెదక్ 26, రంగారెడ్డి 15, ఖమ్మం 15, వరంగల్ 25, నల్గొండ 21, కరీంనగర్ 17, భైంసా 11 మంది చొప్పున వెళ్లారని సమాచారం.  వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. 

మర్కజ్ ఇస్త‌మాలో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నందు వల్ల..ఈ మూడు రోజుల ఇస్త‌మా పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. ఇస్త‌మాలో  పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి త‌బ్లీక్ జ‌మాత్ మర్కజ్ కు వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. 

మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ఇస్త‌మాలో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ఇస్త‌మాలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఈ మూడు రోజుల ఇస్త‌మాలో పాల్గొన్నారు.