భార‌త దేశంలో కరోనాకు గురైన వారి సంఖ్య 147!


డిసెంబరు చివరి వారంలో చైనాలో వెలుగు చూసిన క‌రోనా వైరస్ విషయంలో భారత్ మొదట్నించి అప్రమత్తత తో ఉన్నప్పటికీ.. ఫిబ్రవరి చివరి.. మార్చి మొదటి వారాల్లో కాస్తంత ఉదాసీనత ప్రదర్శించారన్న అభిప్రాయం వుంది. ఇదే.. ఇప్పటి పరిస్థితి కారణంగా చెబుతున్నారు. ప్రపంచాన్ని అంతకంతకూ ఆక్రమిస్తున్న ఈ డెడ్లీ వైరస్ తన తీవ్రతను మ‌రింత పెంచుతోంది. తాజాగా భార‌త దేశంలో కరోనాకు గురైన వారి సంఖ్య 147కు చేరుకుంది. ఇప్పటివరకూ 147 మందిలో కరోనా వైరస్ ను గుర్తించగా.. 130 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 14 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయితే.. ముగ్గురు మరణించారు.

తాజాగా వెల్లడైన గణాంకాల్ని చూస్తే..ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఆరు రోజుల క్రితం ఒక్కసారిగా 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అప్పటివరకూ రోజుకు ఐదారు కంటే తక్కువ కేసులు మాత్రమే నమోదయ్యేవి. దీనికి భిన్నంగా మార్చి 11న అతి ఎక్కువగా ఒక్కరోజులో 20 కేసులు పాజిటివ్ అయ్యాయి. ఆ తర్వాత నుంచి కేసులు నిర్దారణ అయినా.. ఇంత భారీగా లేవు. ఆశ్చర్యకరంగా నిన్న 17వ తేదీ 19 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఈ రోజు ఎనిమిది కేసులు నమోదైనట్లుగా కేంద్రం వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో ఆరో కరోనా పాటిజివ్ కేసు నమోదైంది. ఇతను కూడా విదేశాల నుండి ఇండియా వచ్చిన వ్యక్తే. కరోనా సోకిన వ్యక్తి బ్రిటన్ వెళ్లి వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా ఇది తెలంగాణలో ఆరో పాజిటివ్ కేసుగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఇప్పటివరకూ ఉన్న ఐదు కేసుల్లో ఒక యువకుడికి రికవరీ అవ్వడం తో... అతన్ని గాంధీ ఆస్పత్రి నుంచీ డిశ్చార్జి చేశారు. దాంతో గాంధీ ఆస్ప్రత్రిలోని ఐసోలేషన్ వార్డుల్లో నలుగురికి ట్రీట్మెంట్ అందుతోంది.ఇప్పుడు తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం తో వెంటనే అతన్ని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ లోనూ పకడ్బందీ చర్యలు చేపట్టారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ ఒక కేసు మాత్రమే నమోదైంది. ఏపీలో ఇప్ప‌ట్టి వ‌ర‌కు 22 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిలో విశాఖలో ఐదు.. కాకినాడలో రెండు.. ఏలూరులో ఒకటి.. నెల్లూరులో ఐదు.. చిత్తూరు జిల్లాలో ఐదు.. మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున అనుమానితులుగా వున్నారు.

కరోనా వైరస్ దెబ్బ‌కు ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. విదేశాల్లో వైర‌స్ తీవ్ర‌త‌పై తెలుగువ‌న్ అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం. జ‌ర్మ‌నీ దేశంలోని హాంబ‌ర్గ్ నుంచి గోపి ప్ర‌సాద్ మ‌రిన్ని వివ‌రాలు అందిస్తారు.