ప్రశ్నించే గళమే శ్రీరామరక్ష: సంవిధాన్ దివస్ వేళ ప్రజాస్వామ్య పరిరక్షణపై చర్చ.!
Published on: Thu Nov 26, 2026 9:20AM

భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ 26న నిర్వహించే సంవిధాన్ దివస్ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలు, భిన్న స్వరాలు, ధిక్కార గళాల ప్రాముఖ్యతమై విస్తృత చర్చ జరుగుతోంది. రాజ్యాంగ పరిషత్ సుదీర్ఘ శ్రమ అనంతరం 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించించిన సంగతి తెలిసిందే. అనంతరం 1950 జనవరి 26న అది అమల్లోకి వచ్చి గణతంత్ర దినోత్సవంగా నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ కృషితో రూపుదిద్దుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గౌరవిస్తూ, అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015లో కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను అధికారికంగా రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. గతంలో దీనిని జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో రాజ్యాంగ పీఠిక పఠనం, చర్చాగోష్టులు, క్విజ్ పోటీలు, అవగాహన కార్యక్రమాల ద్వారా రాజ్యాంగ విలువలు, హక్కులు, విధులపై ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు, ప్రశ్నించే హక్కు రాజ్యాంగ ఆత్మను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 1975–76 ఎమర్జెన్సీ కాలంలో పౌరులకు జీవించే హక్కు లేదన్న అభిప్రాయంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో మెజారిటీ వర్గం తీర్పునిచ్చిన పరిస్థితుల్లో.. జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా ఒంటరిగా నిలబడి నమోదు చేసిన చారిత్రక భిన్నాభిప్రాయం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిన ఘట్టంగా నిలిచింది. ఆ తర్వాత 2002లో సమాచార హక్కు చట్టం రావడానికి మూడేళ్ల ముందే, అభ్యర్థుల నేర చరిత్రను తెలుసుకునే ప్రాథమిక హక్కు ఓటర్లకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం 2005లో తీవ్రమైన చర్చోపచర్చల మధ్య పదబంధాలను సానబెడుతూ రూపొందించిన సమాచార హక్కు చట్టం కూడా రాజ్యాంగ ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. రాజ్యాంగం కేవలం న్యాయస్థానాలు లేదా పాలకులకే పరిమితం కాదని, పీఠికలోని ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ ప్రశ్నించే హక్కును సజీవంగా ఉంచుకున్నప్పుడే భారత ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 19(1)(a) పౌరులకు లభిస్తుండగా, జీవించే హక్కును కల్పించే ఆర్టికల్ 21 పౌరసత్వంతో సంబంధం లేకుండా ఈ నేలపై శ్వాసించే ప్రతి వ్యక్తికీ వర్తిస్తుందనే విశ్లేషణ ఉంది. అలాగే ఆర్టికల్ 19ని పక్కన పెట్టి చట్టం ముందు సమానత్వాన్ని తెలిపే ఆర్టికల్ 14ను వేరుగా చూడగలమా, సమానత్వానికి భిన్నమైన అర్థాన్ని ఆర్టికల్ 19 ఎక్కడైనా చెబుతోందా అన్న ప్రశ్నలు కూడా న్యాయ, రాజ్యాంగ చర్చల్లో తలెత్తుతున్నాయి. దేశభక్తి అంటే భయంతో లేదా బెదిరింపులతో చేసేది కాదని, స్వామి వివేకానంద అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు మాతృభూమి మట్టిని నుదుటిపై అద్దుకున్న తీరును ఉదాహరిస్తూ, ఇతరుల పట్ల ద్వేషంతో కాకుండా స్వదేశం పట్ల ప్రేమ, గౌరవంతో వ్యవహరించడమే నిజమైన దేశ భక్తి అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.

మౌలిక హక్కుల విభాగంలో ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వపు హక్కును వివరిస్తుండగా, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాన్ని ఆర్టికల్ 16 ప్రస్తావిస్తోంది. ఆర్టికల్ 16(1) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు లేదా నియామకాల్లో పౌరులందరికీ సమాన అవకాశం ఉండాలి, ఆర్టికల్ 16(2) ప్రకారం మతం, జాతి, కులం, లింగం, పుట్టుకమూలం, జన్మస్థలం, నివాసం వంటి కారణాలతో ఎవరినీ అనర్హులుగా చేయకూడదు లేదా వివక్ష చూపకూడదు. రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత నివాస నిబంధనలపై చట్టాలు చేసే అధికారం ఆర్టికల్ 16(3)లో, తగిన ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఆర్టికల్ 16(4)లో, ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఆర్టికల్ 16(4A)లో ఉన్నాయి. అలాగే 81వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఆర్టికల్ 16(4B) భర్తీ కాని రిజర్వ్డ్ ఖాళీలను వేరే వర్గంగా పరిగణించి ముందుకు తీసుకెళ్లే వెసులుబాటు కల్పిస్తుండగా, మతపరమైన సంస్థల నియామకాల గురించి ఆర్టికల్ 16(5), 103వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఆర్టికల్ 16(6) ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం వరకు రిజర్వేషన్ల అవకాశాన్ని ప్రస్తావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: భారత రాజ్యాంగ పునాదులపై సరికొత్త చర్చ.. డిస్కవరీ అండ్ భారత్ గ్రంథం!
ఈ నిబంధనల అమలు విషయంలో పాలకులు, న్యాయ నిపుణులు వాటి అంతరార్థాన్ని గౌరవించకపోతే అవి కేవలం ఆ హామీలు కాగితాలకే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అమలుకు కట్టుబడని హామీల కోసం రాజ్యాంగాన్ని సవరించడం ఎందుకనే ప్రశ్నతో పాటు, పాలకుల వాగ్దానాల కంటే పౌరుల చైతన్యమే అసలైన బలమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేతలు ఇచ్చే హామీల వెనుక ఉన్న వాస్తవాలను పౌరులు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని, ఏ ప్రభుత్వం కూడా తనంతట తానుగా వ్యవస్థలను మార్చదని, క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురు నేతలు బెయిల్‌పై ఉంటూనే ఎన్నికల్లో పోటీ చేయడం, అధికారంలో కొనసాగడం వంటి అంశాలు ప్రజాస్వామ్య విలువలకు సవాలుగా మారాయని అంటున్నారు. ప్రస్తుత కాలంలో రాజ్యాంగ మౌలిక స్వరూపం ఎదుర్కొంటున్న మూడు ప్రధాన సవాళ్లపైనా ప్రజాస్వామ్య వాదులలో ఆందోళన వ్యక్తమౌతోంది. ఓటు హక్కు, పౌరసత్వం చుట్టూ నెలకొన్న పరిణామాలు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణలు, డీ సిటిజన్‌షిప్ వంటి పేర్లతో లక్షలాది పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు ఓటరు ఎవరు, పౌరుడు ఎవరు అనే ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ కోణంలో బెయిల్‌ను చూసినప్పటికీ, తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై ఉన్నవారు పదవుల్లో కొనసాగడం ప్రజాస్వామ్య ఆశయాలకు విరుద్ధమన్న భావన ప్రజాస్వామ్య వాదులలో బలంగా వ్యక్తమౌతోంది.

రానున్న రోజుల్లో ఓటర్ల జాబితాల పారదర్శకత, పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియలపై న్యాయ, పరిపాలనా యంత్రాంగాల నుంచి స్పష్టమైన హామీలు రావాలని ప్రజలు, పౌర సమాజం ఆశిస్తున్నాయి. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పరిరక్షణతో పాటు న్యాయవ్యవస్థ, ఎన్నికల వ్యవస్థల విశ్వసనీయత మరింత బలోపేతం కావాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది. సంవిధాన్ దివస్ సందర్భంగా జరుగుతున్న ఈ చర్చలు రాజ్యాంగ నిబంధనల అమలు, పౌర హక్కుల రక్షణ, ప్రశ్నించే సంస్కృతిని నిలబెట్టడం వంటి అంశాలపై భవిష్యత్తులో మరింత లోతైన చర్చలకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా సంస్థలు పనిచేస్తాయన్న నమ్మకంతోనే ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియపై తమ విశ్వాసాన్ని నిలుపుకుంటున్నారు.
మీకు నచ్చవచ్చు: రాజ్యాంగ సవరణలు.. రాజకీయాలు.. వాస్తవాలు
మహిళా రిజర్వేషన్లు 33 శాతమే ఎందుకు?
[Constitution Day, Constitution of India, IndianDemocracy, Voice of Defiance, TeluguOne]


