జైల్లోనే బాబును అంతం చేసే కుట్ర.. లోకేష్
posted on Sep 21, 2023 1:41PM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారో వేరేగా చెప్పాల్సిన పని లేదు. జగన్ విపక్ష నేతగా ఉన్న సమయం నుంచీ కూడా చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలు అన్నీ కూడా చంద్రబాబును ఫిజికల్ గా ఎలిమినేట్ చేయాలి అన్న తీరుగానే ఉన్నాయి.
చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలి వంటి వ్యాఖ్యలను ఆయన విపక్ష నేతగా అలవోకగా చేసేశారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జడ్ ప్లస్ క్యాటగరీ భద్రత ఉన్న చంద్రబాబుపై రాష్ట్రంలో వరుస దాడులు జరిగాయి. రాష్ట్ర పోలీసులు చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రత సరిగా లేదని ఎన్ఎస్జీ సైతం కేంద్ర హోం శాఖకు నివేదికలు పంపింది. తెలుగుదేశం కార్యాలయంపై జరిగిన దాడి, కుప్పం, నందిగామ ఇలా బాబు జిల్లాల పర్యటనల సందర్భంగా వైసీపీ నేతలు ఆయనకు అతి సమీపంలోకి వెళ్లి మరీ దాడులకు ప్రయత్నించడం వంటి ఘటనలు చంద్రబాబు భద్రత విషయంలో జగన్ సర్కార్ ఎంత ఉదాశీనంగా వ్యవహరించిందో ఎత్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన చంద్రబాబుకు జైల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టుతో రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో సైతం ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అరెస్టుకు నిరసనగా ర్యాలీలు, ధర్నాలతో ఊరూవాడా దద్దరిల్లుతోంది.
అయితే చంద్రబాబు అక్రమ అరెస్టును జనం ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అంతకు రెట్టింపు జైల్లో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగురాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరిలోనూ ఇదే ఆందోళన వ్యక్తం అవుతోంది. సర్వోన్నత న్యాయస్థానమే ఏపీలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించిందంటే రాష్ట్రంలో ఎంతటి దారుణ పరిస్థితి ఉందో అవగతమౌతుంది.
చంద్రబాబుకు జైల్లో భద్రతపై తనకు భయంగా ఉందని ఆయన సతీమణి భువనేశ్వరి అన్నారు. కనీస సౌకర్యాలు లేవనీ, ఆయనకు కనీసం వేడినీరు ఇవ్వడం లేదనీ, దోమలు విపరీతంగా ఉన్నాయనీ భువనేశ్వరి చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఒక రిమాండ్ ఖైదీ మరణించారు. ఆయన డెంగ్యూ కారణంగా మరణించారు. ధవళఏశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడన్నారు. ఈ సందర్భంగా జైల్లో దోమలు విపరీతంగా ఉన్నాయనీ, చంద్రబాబు గదిలో ఏసీ లేదనీ, మ్యాట్ లు కూడా సరిగా లేవనీ భువనేశ్వరి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ములాఖత్ లో చంద్రబాబు తనతో స్వయంగా చెప్పారని భువనేశ్వరి అన్నారు. ఇప్పుడు అదే జైలులో ఉన్న గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారిన పడి మరణించిన సంఘటనతో చంద్రబాబును కూడా అదే విధంగా అంతం మొందించేందకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వాళ్లూ వీళ్లూ కాదు.. స్వయానా చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చంద్రబాబును అంతమొందించాలన్న కుట్రతోనే జగన్ సర్కార్ ఆయనను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు చంద్రబాబును జైలులోనే అంతం చేసేందుకే ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేయాలన్నదే సైకో జగన్ పన్నాగం అని లోకేష్ అన్నారు. జడ్ ప్లస్ భద్రత ఉన్న ప్రతిపక్షనేత చంద్రబాబుకు జైలులో హాని తలపెట్టే కుట్ర సాగుతోందనీ, ఆయనకు సరైన భద్రత కల్పించలేదనీ, దోమలు విపరీతంగా కుడుతున్నాయని చెబుతున్నా జైలు అధికారులు పట్టించుకోవడం లేదనీ లోకేష్ అన్నారు. జైలులో చంద్రబాబుకు ఏం జరిగినా జగన్ సర్కార్ దే బాధ్యత అన్నారు.