ఇంట గెలిచి రచ్చ గెలవలనుకొంటున్న కాంగ్రెస్

 

సహకార సంఘాల ఎన్నికల ఫలితాలతో మంచి ఊపుమీదున్న కిరణ్ కుమార్ ప్రభుత్వం త్వరలో వ్యవసాయ నీటి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించి, గ్రామ స్థాయిలో తన బలం మరింత పెంచుకొని, గ్రామీణ ప్రాంతాలపై పూర్తిపట్టు సంపాదించుకోవాలని ఆలోచిస్తోంది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్నతరుణంలో, గ్రామీణ ప్రాంతాలతో బాటు, పట్టణ ప్రాంతాలలో కూడా మరింత పట్టుసాధించుకోవాలనే ఆలోచనతో త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్ లకూ కూడా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇంట గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇక రచ్చకూడా గెలవాలనుకొంటున్నట్లు కనిపిస్తోంది.

 

రాష్ట్ర ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అయితే సహకార సంఘాల ఎన్నికల ఫలితాలతో ప్రేరేపితమయి, ఇప్పుడు ఈ ఎన్నికలు నిర్వహించడానికి కిరణ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా, కేంద్రం నిధులు విడుదలచేయాక పోవడంతో అభివృద్ది కుంటుపడుతోందనే ఆలోచనతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

 

మున్సిపాలిటీలకు నిధులు రాక అభివృద్ధి ఆగిపోయిందని ఆయనకి తెలిసిఉన్నపుడు మరి ఇంత కాలం ఎన్నికలు నిర్వహించకుండా ఎందుకు వాయిదా వేసుకొంటూ పోయారు? ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే, ఎన్నికలు జరగకపోవడం, నిధులు రాకపోవడం, అభివృద్ధి కుంటూ పడటం జరిగిందని ఆయన పరోక్షంగా ఒప్పుకొంటున్నారా?అనే ప్రశ్నలు తలఎత్తుతాయి.

 

రాజకీయ కారణాలతో ఇంతకాలం మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా వేసుకొచ్చినా, ఈసమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి నగరాలలో, పట్టణాలలోకూడా పార్టీ బలపడితే, తద్వారా సాధారణ ఎన్నికల సమయానికి నగరాలపై కూడా తమ పార్టీ పూర్తి ఆదిపత్యం సాదించవచ్చని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును.

 

అయితే, గ్రామీణ ప్రాంతాలలో రాబట్టిన ఫలితాలను పట్టణాలలో కూడా రాబట్టడం మామూలు విషయం కాదు. ఒకవేళ, కాంగ్రెస్ ఆ ప్రయత్నంలో కూడా సఫలమయితే ఇక దైర్యంగా సాధారణ ఎన్నికలకోసం ఎదురుచూడవచ్చును. అయితే కాంగ్రెస్ ఎన్నికల కలలు నిజం అవుతాయా లేక కల్లలుగానే మిగిలిపోతాయా అనే ప్రశ్నకు పట్టణ ప్రాంతప్రజలే జవాబు చెప్పగలరు.