కాంగ్రెస్ త్యాగం చేస్తోందా? లేక ప్రాంతీయ పార్టీలు ఆగం చేస్తున్నాయా?

భారతదేశ తదుపరి ప్రధాని ఎవరు? దీనికి ఖచ్చితమైన సమాధానం ఎవరి వద్దా వుండదు. కానీ, ఎవరి విశ్లేషణలు వారికి వుంటాయి. కొందరు మోదీ తప్పకుండా మళ్లీ పీఎం అవుతారని చెప్పవచ్చు. కొందరు మోదీ తప్పకుండా ఓడిపోతారని చెప్పవచ్చు. కానీ, సమస్య ఏంటంటే… తరువాతి ప్రధాని అన్న చర్చ మోదీ చుట్టూనే జరుగుతోంది తప్ప మరో నాయకుడెవరూ సోదిలోకి రావటం లేదు! మోదీ కాకుంటే ప్రధాని అయ్యేది ఎవరు? రాహుల్ అనే వారే అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఇక మిగతా ప్రాంతీయ నేతల ప్రధాని కలలైతే మరీ బలహీనంగా వున్నాయి. వారి వారి పార్టీల చోటామోటా నాయకులే మా నేత నెక్ట్స్ పీఎం అంటారు తప్ప మరెవరూ మాట్లాడరు. ఇదీ పరిస్థితి!

 

 

మోదీనే తప్పకుండా మళ్లీ ప్రధాని అవుతారని కేవలం ఆయన భక్తులే కాదు చాలా మంది వ్యాపార వర్గాల వారు కూడా నమ్ముతున్నారు. నోట్ల రద్దు , జీఎస్టీ వంటి నిర్ణయాలతో మోదీ కొంత వరకూ ఇబ్బంది పెట్టినా ఆయనని ఢీకొట్టే వ్యూహం ఏదీ ప్రతిపక్షాల వద్ద లేదనేది చాలా మంది విశ్లేషణ. తాజాగా ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక మోదీ ఎట్టి పరిస్థితుల్లో మరోసారి పీఠం ఎక్కడనే వారికి కూడా కొదవ లేదు. కాంగ్రెస్ వాళ్ల నుంచీ కమ్యూనిస్టుల దాకా చాలా మంది మోదీని మళ్లీ వద్దనుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీల్ని సపోర్ట్ చేసే చాలా మంది ఓటర్లు కూడా మోదీ పట్ల సుముఖంగా ఏం లేరు! మొత్తం ఇలా ఎటూ స్పష్టత లేని స్థితిలో వున్న సమయంలో రాహుల్ చేజేతులా మంచి అవకాశాన్ని వృథా చేసుకుంటున్నట్టే కనిపిస్తోంది!

నెక్ట్స్ పీఎంగా మోదీకి కాస్త ఎక్కువ మద్దతే కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కూడా చాలా వర్గాలకే ఆశాదీపంగా వున్నారు. అయితే, ఆయన మాటలు, చేష్టలు, వ్యూహాలు మంచికంటే చెడు ఎక్కువగా చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానంలో ఎవరూ ఊహించని విధంగా మోదీని వాటేసుకుని కలకలం సృష్టించాడు. దాని వల్ల అద్భుతం జరిగిందంటూ కొంత మేర ప్రచారం జరిగినా సోషల్ మీడియాలో సామాన్యుల అభిప్రాయం మాత్రం మరోలా వుంది. ప్రధానిని హగ్ చేసుకుని ఊరుకుంటూ కొంత వరకూ బాగానే వుండేది. కానీ, అంతలోనే కన్నుగీటి చేజేతులా కామెడీ చేసుకున్నాడు. ఇలాంటి ప్రవర్తనే రాహుల్ ని ప్రధాని పదవి రేసులో నిలపలేకపోతోంది.

 

 

రాహుల్ మోదీని వాటేసుకోవటం ద్వారా జనంలోకి సంచలనకరమైన మెసేజ్ పంపాలని మూడు నెలల కిందటే ప్లాన్ చేసుకున్నాడని కొన్ని కాంగ్రెస్ వర్గాలు మీడియాకి లీకులు కూడా ఇస్తున్నాయి. అంత ప్లాన్ చేసుకుని అలాంటి పబ్లిసిటీ స్టంట్ చేయటం ఎందుకు? ఇక్కడే కాంగ్రెస్ , కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి బలహీనతలు బయటపడుతున్నాయి. వీటినే మోదీ పదే పదే క్యాష్ చేసుకుంటూ వస్తున్నారు!

మోదీ , రాహుల్ గాంధీల పార్లమెంట్ డ్రామాలు, హావభావ భంగిమలు పక్కన పెడితే అవిశ్వాస తీర్మానం ఫలితం మాత్రం హస్తం పార్టీపై తీవ్రంగానే ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తుంది! పార్లమెంట్లోని 350 మంది దాకా ఎంపీలు మోదీవైపున నిలవటం సోనియా, రాహుల్ ను పునరాలోచనలో పడేసిందట. అందుకే, కాంగ్రెస్ పెద్ద త్యాగానికి కూడా సిద్ధమైపోయిందని అంటున్నారు. రాహుల్ ప్రధాని అయినా కాకున్నా మోదీ మళ్లీ అధికారంలోకి రావద్దు అనేది వారి తాజా వ్యూహమట! అందుకోసం మమతా బెనర్జీ, మాయావతి లాంటి ఆరెస్సెస్, బీజేపీ నేపథ్యం లేని సెక్యులర్ నేతల్ని ప్రధానిగా ముందుంచబోతోందట. ఇంకా దీనిపై ఎలాంటి అదికారిక నిర్ణయం తీసుకోనప్పటికీ రాహుల్ ప్రధాని పదవి త్యాగం చేయటం మాత్రం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే, అవిశ్వాస తీర్మానంలో మోదీకి వచ్చిన మద్దతుతో కాంగ్రెస్ కు తన పరిస్థితి ఏంటో క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ కు రికార్డు స్థాయిలో సీట్లు వస్తే తప్ప రాహుల్ నేతృత్వంలో పని చేయటానికి ఇతర పార్టీల వారు సిద్ధంగా లేరు! అదీ అసలు సమస్య…

 

 

అసలే అంతంత మాత్రంగా వున్న విశ్వాసాన్ని రాహుల్ రోజు రోజుకు పెంచుకుంటున్నట్టు ఎంత మాత్రం కనిపించటం లేదు. మీడియాలో గంటల తరబడి చర్చలే తప్ప యువనేతకు ఓట్ల బరిలో ఒదుగుతున్నదేం లేదు. కర్ణాటకలో బీజేపీ రాకుండా ఆపగలిగినా అక్కడ తమ సీఎం సీటు కోల్పోయి కుమార స్వామి లాంటి ప్రాంతీయ నేతకు దాసోహమానల్సి వచ్చింది. త్వరలో రాబోయే ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ ఎన్నికల్లోనూ హస్తానికి అలాంటి దుస్థితే ఎదురయ్యేలా వుంది. మాయవతి కాంగ్రెస్ కు అండగా వుంటానని ఫీలర్లు ఇస్తూనే తాను కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే నెక్ట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పొత్తు పై పునరాలోచన అంటోంది. అంటే, కాంగ్రెస్ మోదీని అడ్డుకునే తాపత్రయంలో మాయవతి వంటి ప్రాంతీయ నేతలకి లొంగాల్సిన స్థితి వచ్చేసిందన్నమాట!

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ఈ మధ్యే రాహులే తమ పీఎం క్యాండిడేట్ అని ఘనంగా ప్రకటించింది. పొత్తులు కూడా ఆయన ఇష్టమేనని ఎప్పటిలాగే గాంధీ కుటుంబ విదేయత చాటుకుంది. కానీ, పార్టీ గుర్తించలేకపోతోన్న విషయం ఏంటంటే… మోదీని ఎదుర్కోవటం గాంధీ కుటుంబ విధేయత వల్ల సాద్యం కాదు. రాష్ట్రాల్లో మళ్లీ పునర్వైభవం సంపాదించుకోవాలి. అలా కాకుండా తాము గెలవాలని కాకుండా మోదీ ఓడాలని రాజకీయం చేస్తూ పోతుంటే… కుమార స్వామి, మాయవతి, మమతా… ఇలా అందరూ హస్తాన్ని తమకు నచ్చినట్టు మెలిపెట్టేస్తారు! అప్పుడిక రాహుల్ ప్రధాని కల… శాశ్వత పగటి కలగా మిగిలిపోయే ప్రమాదమూ వుంది!