మధుయాష్కీ హత్యకు కుట్ర జరిగిందా..?

 

నాపై జరిగిన దాడి హత్యాయత్నమేనని, పథకం ప్రకారమే హత్యాయత్నానికి టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్పడ్డారని కాంగ్రెస్‌ నేత మధు యాష్కి ఆరోపించారు. తాజాగా ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్‌ తమపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. పోలింగ్‌ రోజున రోహిత్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డిపై దాడి ఇందులో భాగమేనన్నారు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వెళుతుండగా  తనపై మెట్‌పల్లి వద్ద జరిగింది సాధారణ దాడి కాదని, తనను హతమార్చే కుట్ర అని ఆరోపించారు.  'కొమిరెడ్డి అనుచరులం..' అంటూ తన వాహనంపై దాడి చేశారని చెప్పారు. ఘటన తర్వాత కొమిరెడ్డి రాములు తదితరులతో ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడినట్టు తనకు సమాచారం ఉందని మధుయాష్కీ తెలిపారు. మెట్ పల్లికి వెళ్లినప్పుడు తనపై పక్కా ప్రణాళికతో హత్యాయత్నం జరిగిందని,ఇందుకోసం దుండగులు 3 రోజుల ముందే స్కెచ్ వేసి ఎదురుచూశారని ఆరోపించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం ఖాయమని మధుయాస్కీ అభిప్రాయపడ్డారు. పోలింగ్‌ సరళి చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. సోనియా గాంధీ సభతో కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో మరింత స్పందన వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభంజనం వీస్తోందన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా విజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు. ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ ఎప్పుడూ ఆధారపడలేదని, కాంగ్రెస్ పార్టీ ప్రజల నాడిని నమ్మిందని అన్నారు. ప్రజాకూటమికి ప్రజలు మద్దతు పలికారని చెప్పారు. గతంలో చాలా ఎన్నికల విషయంలో ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు తప్పని తేలిందన్నారు. లగడపాటి సర్వే ప్రజాకూటమికి అనుకూలంగా ఉండడం చూసే తెరాస నాయకులు ఆయనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.