రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్... క్రమశిక్షణా చర్యలు ఉంటాయని వార్నింగ్

 

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు జగన్ దృష్టికి రావడంతో సీఎం మండిపడ్డారు. అలాగే, రఘురామకృష్ణంరాజు వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన జగన్మోహన్ రెడ్డి.... నరసాపురం ఎంపీ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంగ్లీష్ మీడియంపై రాష్ట్రంలో రగడ జరుగుతున్నవేళ... లోక్ భలో రఘురామకృష్ణంరాజు... మాతృభాషా పరిరక్షణపై అస్పష్టంగా మాట్లాడారని జగన్ దృష్టికి వెళ్లింది. మీడియాలో కూడా ఆవిధంగా కథనాలు రావడంతో... పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ ఇన్ ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో చర్చించిన జగన్మోహన్ రెడ్డి.... పార్లమెంట్ లో రఘురామకృష్ణంరాజు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా పార్టీలో ఎవరు మాట్లాడినా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించిన జగన్.... రఘురామకృష్ణంరాజుకి క్లాస్ పీకాలని వైవీని ఆదేశించారు. అంతేకాదు, ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా... పేద పిల్లల అభ్యున్నతిని అడ్డుకోవడమేనన్నారు.

అయితే, తాను తెలుగు భాష అభివృద్ధి గురించి మాత్రమే లోక్ సభలో మాట్లాడానని, తమ ప్రభుత్వం తీసుకున్న ఇంగ్లీష్ మీడయానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనలేదని రఘురామకృష్ణంరాజు మీడియాకి వివరణ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా తాను మాట్లాడాననడం పచ్చి అబద్ధమన్నారు. అసలు, ఇంగ్లీష్‌ అన్న పదమే వాడలేదని చెప్పారు. కావాలంటే లోక్ సభలో తాను మాట్లాడిన ప్రసంగ వీడియోను చూడొచ్చని అన్నారు. తాను ఎప్పుడూ ఇంగ్లీష్ మీడియంపై ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు. తెలుగు భాషను ప్రేమించడమే తప్పయితే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటున్నారు. 

తెలుగు భాషకు అన్యాయం చేస్తున్నారంటూ టీడీపీ ఎంపీ కేశినేని ఆరోపణలు చేయడంతో... తాను కౌంటర్ ఇచ్చానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ఏమీచేయలేదని... చంద్రబాబు హయాంలో తెలుగు అకాడమీనే పట్టించుకోలేదని... కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక... తెలుగు అకాడమీని పునరుద్ధరించారని లోక్ సభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. అయితే, తెలుగు అకాడమీ విభజన జరగకపోవడంతో నిధులు ఆగిపోయాయని, త్వరగా విభజన పూర్తిచేసి నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అంతేగాని, ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ ఒక్క మాట కూడా తాను అనలేదన్నారు. అయినా తాను ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం కాదన్నారు. తనను ఎవరూ సంజాయిషీ అడగలేదని, కేవలం మీడియాలో వార్తలను చూసే స్పందిస్తున్నానని అన్నారు. ఒకవేళ సంజాయిషీ అడిగితే వివరణ ఇస్తానన్నారు రఘురామకృష్ణంరాజు.

అయినా, తెలుగు భాష... ఇంగ్లీష్ మీడియం వేర్వేరు అంశాలన్న రఘురామకృష్ణంరాజు.... తెలుగు అంటే తనకెంతో ఇష్టమని... తెలుగు భాషను తాను ప్రేమిస్తానని... తెలుగు అంటే తనకు ప్రాణమని చెప్పుకొచ్చారు. ఒకవేళ తెలుగు భాషను ప్రేమించినందుకు తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానంటే అందుకు సిద్ధమేనన్నారు. తెలుగు భాషాభివృద్ధికి నిధులు అడగడం నేరమైతే... తాను శిక్షార్హుడినే అంటున్నారు రఘురామకృష్ణంరాజు. మరి, రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలిపై ఎప్పట్నుంచో గుర్రుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.