గవర్నర్ ని కలిసిన ముఖ్యమంత్రి

 

ఈ రోజు శాసనసభలో ఆర్ధికమంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత సభ రేపటికి వాయిదా పడింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్నికలిసి ఆయనతో దాదాపు అర్ధగంటసేపు సమావేశమయ్యారు. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టగానే ఆయన రాజీనామా చేయబోతున్నారని ఆయన సన్నిహితులు ఇదివరకే మీడియాకు చెప్పడంతో, బహుశః ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కి అందించేందుకే వెళ్లి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. కానీ, అటువంటిదేమీ లేదని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత, ఆయన మర్యాదపూర్వకంగా కలిసారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మీడియా ఊహాగానాలకు బ్రేకులు వేసే ప్రయత్నాలు చేసారు. ఎప్పుడు ఉల్లాసంగా కనబడే ముఖ్యమంత్రి గవర్నర్ ని కలిసి తిరిగి వెళ్ళేటపుడు చాలా ముభావంగా ఉండటంతో బహుశః ఆయన రాజీనామా లేఖ ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏమయినప్పటికీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా దాదాపు ఖరారు అయిపోయినట్లే కనిపిస్తోంది. ఆయన ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం.