కిరణ్ కొత్త పార్టీ పెడతారా?

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇదివరకులాగా అధిష్టానం మీద రంకెలు వేయడం లేదు. అదేవిధంగా ఇదివరకులా సమైక్యమని గొంతుచించుకోవడం లేదు. ఆవిషయం శాసనమండలిలో చేసిన ప్రసంగంతో తేటతెల్లమయింది. అయితే ఇంకా ఆఖరు బంతికి చాలా సమయం ఉందని, నేటికీ తను సమైక్యవాదినేనని చెప్పుకోవడం విచిత్రం. ఏమయినప్పటికీ ఆయన ఈ నాలుగయిదు నెలలలో పెంచుకొన్న తన రేటింగ్ మళ్ళీ క్రమంగా పడిపోవడం మొదలయింది. అందువల్ల ఇప్పుడు ఆయన స్వంత కుంపటి పెట్టుకొన్నా దానికి ఇదివరకంతటి ప్రజాదారణ ఉంటుందానేది అనుమానమే.

 

అయితే కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి, లగడపాటి, హర్ష కుమార్, సబ్బం హరి వంటి వారు నిజంగా కాంగ్రెస్ అధిష్టానంతో విభేదిస్తున్నా లేక ఆవిధంగా నటిస్తున్నా వారు ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే వారి పైన, పార్టీపైనా ప్రజలలో ఇంకా అనుమానాలు పెరిగే అవకాశం ఉంది గనుక  కొత్త పార్టీ ఆవిర్భావం తప్పని సరి కావచ్చును. ఈసారి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎలాగు గెలిచే అవకాశాలు లేవు గనుక, మునిగిపోయే ఆ నావలో పయనించడం కంటే కొత్త నావ ఏర్పాటు చేసుకొని పయనించడమే ఎంతో కొంత మేలు. తద్వారా ఎన్నికలలో గెలిచే అవకాశాలు కొంతయినా మెరుగుపడటమే కాకుండా, ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం వారిచేత ఆడిస్తున్ననాటకంలోనే ఇది కూడా ఒక భాగమయి ఉంటే వచ్చేఎన్నికలలో ఓట్లు చీల్చి సీమాంధ్రలో తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకొనే అవకాశం కూడా ఉంటుంది. ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి తగు నిర్ణయాలు తీసుకొనే వీలుంటుంది.