యోగా డేపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు దిశానిర్దేశం

ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఈ ఏడాది ఎపిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు జరిగిన రిజస్ట్రేషన్లు, జిల్లాల్లో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం అద్భుతంగా ఉందన్నారు. పూర్తి స్థాయి సన్నద్ధతతో, ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న చంద్రబాబు,  జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు.

జూన్ 21న ప్రధాని నరేంద్రమోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయనీ, వీటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు.  యోగాడైపై మంగళవారం (జూన్ 3) నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. యోగా డే కంటే ముందు రెండు సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.   7వ తేదీ ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో యోగా డే అవగాహనా ర్యాలీలు, 14 వతేదీ రాష్ట్రంలో లక్ష  ప్రాంతాల్లో యోగా సాధన ఉంటుందన్నారు.  చేస్తారు. ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశం ఉన్న అన్ని సంస్థలు, ప్రాంతాల్లో 14వ తేదీ యోగా నిర్వహించి యోగా డేకు ప్రజలను సిద్దం  చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.  ఈ సమీక్ష సమావేశంలో  మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయస్వామి, సత్యకుమార్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు.

యోగా మాసంలో భాగంగా ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో జరిగిన కార్యక్రమాలను, యోగా డే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21వ తేదీన విశాఖలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేందుకు జర్మన్ హ్యాంగర్లతో మరో వేదిక సిద్ద చేసినట్లు అధికారులు తెలిపారు.