చంద్రబాబు ర్యాంకులపై రచ్చ.. స్పీడ్ తగ్గించే ప్రయత్నం చేశారా

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు వారి పనితీరును బట్టి ర్యాంకింగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ పైనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ ర్యాంకింగ్ లో పీతల సుజాతకు మొదటి ర్యాంకు రాగా.. తన కొడుకు చేసిన పనికి ఆరోపణలు ఎదుర్కొంటున్న రావెల కిశోర్ ఆరో స్థానం సంపాదించుకున్నారు. ఇంక ఎంతో రాజకీయానుభవం ఉన్న ఉద్దండులు యనమల అచ్చేన్నాయుడు లు కూడా వారి తరువాత స్థానాలు పొందారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే.. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి నారాయణ అందరికంటే ఆఖరి స్థానంలో ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు ఈ ర్యాంకులకు వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారట. దీనిపై వైసీపీ నేత స్పందించి.. మంత్రి నారాయణకు చివరి స్థానం రావడం చాలా ఆశ్చర్యంగా ఉందని.. బహుశా రాజధాని విషయంలో నారాయణ స్పీడ్ ఎక్కువైందనే చివరి స్థానం ఇచ్చి... ఆయన స్పీడ్ తగ్గించే ప్రయత్నం చేశారా అంటూ ఎద్దేవ చేశారు. ఇంకా ఈ ర్యాంకులపై  పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ర్యాంకుల గురించి తనకు మీడియా ద్వారానే తెలిసింది, మంత్రి నారాయణ రేయింబవళ్లు కష్టపడుతున్నారని, అతనికి చివరి ర్యాంకు రావడంపై తాను ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు.

 

ఇదిలా ఉండగా ర్యాంకుల విషయంలో పొరపాటు జరిగిందనే వాదన కూడా వినిపిస్తుంది. పది అంశాల ప్రాతిపదికన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేసి ర్యాంకులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశిస్తే, కేవలం వారు చేసిన పర్యటనలు, నిర్వహించిన మీడియా సమావేశాల ఆధారంగా హడావిడిగా ర్యాంకులు ఇచ్చారంటున్నారు. ఇది తెలిసి చంద్రబాబు కూడా ర్యాంకులు అసమగ్రమని తేల్చి చెప్పారని అంటున్నారు. కాగా చంద్రబాబు మంత్రులుకు ఇచ్చిన ర్యాంకులు ఇవే.

1.       పీతల సుజాత
2.       దేవినేని ఉమామహేశ్వరరావు
3.      పత్తిపాటి పుల్లారావు
4.      కామినేని శ్రీనివాసరావు
5.      పరిటాల సునీత
6.      రావెల కిశోర్ బాబు
7.      అచ్చెన్నాయుడు
8.      గంటా శ్రీనివాసరావు
9.      కొల్లు రవీంద్ర
10.     చింతకాయల అయ్యన్నపాత్రుడు
11.     పల్లె రఘునాథ రెడ్డి
12.     మాణిక్యాలరావు
13.     కిమిడి మృణాళిని
14.     యనమల రామకృష్ణుడు
15.     పైడికొండల మాణిక్యాల రావు
16.     కేఈ కృష్ణమూర్తి
17.     నారాయణ