చంద్రబాబు క్లాసులో విద్యార్థిగా మారిన లోకేష్

 

ఏపీ ప్రభుత్వం మరో రికార్డు సాధించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకే రోజు రెండు కోట్ల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం.. మెగా పీటీఎం 2.0 నిర్వహిస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు అందరినీ ఒక చోటకు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో  నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. 


మెజా పీటీఎం-20 కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తి విద్యార్థులకు ‘వనరులు’ అన్న సబ్జెక్ట్‌పై క్లాస్ చెప్పారు. సహజ వనరులు, పునరుత్పాదక వనరుల వినియోగం, సంరక్షణ గురించి విద్యార్థులకు సీఎం బోధించారు. సుస్థిరమైన అభివృద్ధి సాధించాలంటే వనరుల సద్వినియోగం అవసరమని విద్యార్ధులకు వివరించారు. విద్యార్ధులు చదువుకునే పాఠ్యపుస్తకాలు కూడా ఇతరులు మరోమారు వినియోగించుకునేలా జాగ్రత్తగా వాడాలని సూచించారు. విద్యుత్, నీరు లాంటి వనరుల సద్వినియోగం కూడా సామాజిక బాధ్యత అంటూ స్టూడెంట్స్‌కు చెప్పారు చంద్రబాబు. 

కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల వైపు విద్యార్ధులు దృష్టి పెట్టాలన్నారు. అందరూ ఉద్యోగాలే కాదు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగానూ మారాలన్నారు. నారా లోకేశ్ బాగా చదువుకుని ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి అయ్యారని వెల్లడించారు. ప్రజలకు మంచి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్.. విద్యార్థులతోపాటు బల్లపై కూర్చుని సీఎం చెప్పే పాఠాన్ని ఆసక్తిగా వినడం విశేషం.