ముఖ్యమంత్రి కనబడుట లేదు

 

నిన్న మొన్నటి వరకు తన బంగారు తల్లిని వెంటబెట్టుకొని ఇందిరమ్మ కలలు కంటూ ఊరువాడా తిరిగుతూ, ప్రజల కోసమే ఈ జీవితమంటూ మైకులు బ్రద్దల్లయ్యేలా పెద్ద గొంతుతో స్వీయ చాటింపు వేసుకొన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గత వారం రోజులుగా కనబడుటలేదని రాష్ట్ర ప్రజలు చాలా కంగారు పడుతున్నారు.

 

అసలు ఆయన రాష్ట్రంలోనే ఉన్నారా లేక డిల్లీలో ఉన్నారా? అని మీడియా వాళ్ళు కూడా ఆయన కోసం తెగ వెదుకుతున్నారు. కానీ  వాళ్ళు కూడా ఆయన ఆచూకీ కనుగొనలేకపోయారు.

 

అయితే, (తెలంగాణా) పంచాయితీలకి పెద్దన్నజానారెడ్డి మాత్రం రెండు మూడు రోజుల క్రితం ఆయన సీమంధ్ర మంత్రులతో తలుపులేసుకొని మాట్లాడుతుంటే తానూ కిటికీలోంచి చూశానని, అప్పుడు ఆయన పక్కన బొత్స బాబు కూడా ఉన్నారని, వారిద్దరూ ఏదో సమైక్య లేఖలు సంతకాలు చేస్తున్నారని, దానిని తానూ ఖండిస్తున్నానని చెప్పడంతో జనాలు కూడా తేలికపడ్డారు.

 

మేము కట్టిన పన్నులతో వాళ్ళక్కడ పనిచేయకుండా ఏసి గదుల్లో కులాసాగా కబుర్లు చెప్పుకొంటుంటే మేము మాత్రం ఆఫీసులలో పని చేయలా ఇదేమి (సమ) న్యాయం? అంటూ, అధికారులు, ప్రభుత్వోద్యోగులు, జనాలు అందరూ కూడా గిన్నెలు ముంతలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చేసారు. 

 

‘యదారాజ తదా ప్రజా’ అంటే ఏమిటో ఇప్పుడు మన రాష్ట్రాన్నిచూస్తే ఎవరికయినా ఇట్టే అర్ధమవుతుంది.

 

ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ సచివాలయం మొహం చూసి చాలా రోజులయింది. ఇక కేసీఆర్ వ్యాఖ్యలతో సచివాలయ ఉద్యోగులు ఆంధ్ర, తెలంగాణా ఉద్యోగులుగా విడిపోయి రోడ్ల మీద కత్తులు దూసుకొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా ఆఫీసులు కంటే రోడ్డు పదిలం అనుకొంటూ సమైక్యంగా రోడ్డు మీద వంటా వార్పులు చేసుకొంటూ రకరకాల ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు. మాకు మాత్రం ఆట విడుపు ఉండకపోతే ఎలా మేము ప్రజలమే (మనుషులమే) అంటూ జనాలు కూడా కార్యాలయాలకు, కాలేజీలకు, ఖార్కానాలకు, దవాఖానలకు తాళాలు వేసుకొని వచ్చి రోడ్ల మీద అవేశపడుతూ సేద తీరుతున్నారు.

 

ప్రజల వెనుక ప్రజా ప్రతినిధులున్నారో లేక వారి వెనుక ప్రజలున్నారో తెలియని పరిస్థితిలో మన ప్రజా ప్రనిధులు కూడా రాజీనామా లేఖలను ముక్కు మొహం తెలీని వాళ్ళ చేతుల్లో పెట్టి ‘సమైక్య చాంపియన్ షిప్’ పోటీలో పరుగులు పెడుతున్నారు.

 

ఇక త్వరలో ఆర్టీసీ, విద్యుత్, మునిసిపాలిటీ సిబ్బంది కూడా రోడ్లమీద వంట వార్పూ రుచి చూడాలని ఉవ్విళ్ళురుతున్నారు. ఇక ఏవయినా శాఖలు మిగిలి ఉంటే వాళ్ళు కూడా తమ కార్యలయాలకి తాళాలు వేసుకొని వచ్చేస్తే, విజయమ్మ కోరుకోన్నట్లు అందరికీ సమన్యాయం జరుగుతోందని పండగ చేసుకోవచ్చును. కానీ, ఆ పండగ చేసుకోవడానికి డబ్బులెక్కడి నుంచి వస్తాయన్నదే పెద్ద ప్రశ్న.