హెచ్‌సీఏ స్కాంలో దూకుడు పెంచిన సిఐడీ.. నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్!
posted on Jul 11, 2025 2:46PM

హెచ్‌సీఏ స్కాంలో సీఐడీ స్పీడ్ పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత భర్త.. క్లబ్ కార్యదర్శి రాజేందర్ యాదవ్ చర్లపల్లి జైలులో ఉన్నారు. వీరందరినీ రిమాండ్‌కు తరలించింది సీఐడీ. అలాగే రిమాండ్ రిపోర్టులో నిందితులపై సీఐడీ సంచలన అభియోగాలు మోపింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు నియామకాన్నే తప్పుబట్టింది. మరింత దర్యాప్తు చేసేందుకు ఈ రోజు సీఐడీ అధికారులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. మరోవైపు నిందితులు కూడా బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.
ఈ స్కాంలో అరెస్ట్ అయిన ఐదుగురిలో నలుగురు చర్లపల్లి జైలులో ఉండగా.. కవిత చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. ఈ ఐదుగురిని కస్టడీలోకి తీసుకుంటే హెచ్‌సీఏకు సంబంధించిన అవకతవకలు, హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐడీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్కాంలో సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు సి.కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు, రాజేందర్ యాదవ్, కవిత కలిసి శ్రీచక్ర క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఫోర్జరీ డాక్యమెంట్లను సృష్టించి.. ఆ క్రికెట్ క్లబ్‌కు జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.