బాబాయిపై అఖిలేష్ వేటు

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే తండ్రి, కొడుకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా తాజాగా అఖిలేష్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఆ దూరాన్ని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ యూపీ చీఫ్, బాబాయి శివపాల్‌ యాదవ్‌ను సీఎం అఖిలేష్ కేబినెట్ నుంచి తొలగించారు. శివపాల్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులపైనా ఆయన వేటు వేశారు. రాష్ట్రంలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులతో ముఖ్యమంత్రి అఖిలేష్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. తనకు వ్యతిరేకంగా లేదా అమర్‌సింగ్‌కు అనుకూలంగా వ్యవహరించే ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోనని ఆ సమావేశంలో అఖిలేష్ హెచ్చరించాడట. అన్న మాట ప్రకారం శివపాల్‌ యాదవ్‌తో పాటు షబాబ్ ఫాతిమా, ఓం ప్రకాశ్, నారద్ రాయ్‌లపై వేటు వేశాడు. మరోవైపు అమర్‌సింగ్ అనుచరులుగా ఉన్న నలుగురు మంత్రులతో పాటు నామినేటేడ్ పదవులు అనుభవిస్తున్న వారిపైనా చర్యలు తప్పదని భావిస్తున్నారు.