చంద్రబాబు నాయుడుకి అరుదయిన పురస్కారం

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి చాలా అరుదయిన పురస్కారం దక్కింది. అమెరికాలో ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో గల షికాగో విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అరుదయిన పురస్కారానికి తన పేరును ఎంపిక చేయడంపై స్పందిస్తూ “నేను రాష్ట్రాభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మనసులలో శాస్విత స్థానం దక్కించుకోగలిగితే నా జన్మ ధన్యమయినట్లు భావిస్తాను. అంతకంటే గొప్ప డాక్టరేట్ మరొకటి ఉండదు. ఇదివరకు కూడా నాకు కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలనుకొన్నాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించాను. షికాగో విశ్వవిద్యాలయం అందిస్తున్న ఈ డాక్టరేట్ స్వీకరించడం చాలా గౌరవంగానే భావిస్తున్నాను కనుకనే స్వీకరించేందుకు అంగీకరించాను,” అని తెలిపారు. ఈ విషయం తెలియగానే తెదేపా నేతలు, మంత్రులు, అనేక మంది ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. యాదృచ్చికంగానే సరిగ్గా ఇవ్వాళ్ళే ప్రముఖ రచయిత్రి ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించబడింది. ఒకే రోజున తెలుగు రాష్ట్రానికి రెండు అపురూపమయిన పురస్కారాలు లభించడం విశేషమే.