ఎన్నికల వ్యాపారం.. డబ్బులుంటేనే వైసీపీలో టికెట్లు

 

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ నేతలతో ఈరోజు ఉదయం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ హైదరాబాద్‌లో విలాసంగా కూర్చుని, అక్కడే కేసీఆర్ సహకారంతో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో నివసించడమే ఇష్టంలేని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. వైసీపీ టికెట్లకు ప్రజాసేవ కొలమానం కాదు.. డబ్బు సంచులే కొలమానమని ధ్వజమెత్తారు. జగన్ ఒకసారి పోటీ చేసిన వారికి మరోసారి అంత తేలిగ్గా అవకాశమివ్వరని, డబ్బులు ఎవరిస్తే వారికే టికెట్లు ఇచ్చే వ్యక్తి అని విమర్శించారు. జగన్ కు ఎన్నికల అంటే వ్యాపారమంటూ ధ్వజమెత్తారు.

ఎన్నికల సమయంలో ఎలా వెళ్లాలనేది ఇవాళ నిర్ణయిస్తామన్నారు. ఈ సారి అభ్యర్థుల ఎంపిక చివరి నిమిషం వరకు సాగదీయబోమని, సరైన సమయంలో ప్రకటించుకుంటూ ముందుకు వెళతామని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పిన అన్ని అంశాలను నెరవేర్చామని ఆయన స్పష్టంచేశారు. ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు పార్టీ యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. ఏపీలో అభివృద్ధిని ప్రధాని మోదీ జీర్ణించుకోలేరని, ఏపీని చూస్తుంటే కేసీఆర్‌కు కూడా కంటగింపుగా ఉందని విమర్శించారు.