బీజేపీ,జగన్,పవన్ పై సీఎం ఫైర్..

పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరులో నిర్వహించిన నగర దర్శిని కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య మంత్రి చంద్రబాబు కేంద్రంపై విమర్శలు గుప్పించారు.ఆంధ్రప్రదేశ్‌కు అండగా ఉంటామని భాజపా హామీ ఇవ్వడం వల్లే తాము ఎన్డీయేలో చేరామని, కానీ ఇచ్చిన మాటను భాజపా నిలబెట్టుకోలేకపోయిందన్నారు.రాష్ట్రానికి అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి దేశంలోని రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టినట్టు చెప్పారు.ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా ఇచ్చేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టబోమని చంద్రబాబు తేల్చి చెప్పారు.

 

 

14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి ప్రత్యేక హోదా రాకుండా ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ దారుణంగా మాట్లాడారని అన్నారు.వైకాపా ట్రాప్‌లో పడ్డామని అంటున్నారని, వారి ట్రాప్‌లో పడింది భాజపాయేనన్నారు.కేంద్రం సాయం చేయకపోయినా.. రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ఆగదన్నారు.తమ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్న విపక్షాలపైనా చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వైకాపా అధ్యక్షుడు జగన్‌కు కేసుల భయం పట్టుకుందని, అందుకే ఆయన భాజపా సరసన చేరి రాష్ట్ర సర్కార్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి శనివారం వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.అభివృద్ధిని అడ్డుకుంటున్న భాజపాకు జగన్‌ అండగా నిలుస్తున్నారన్నారు.కొత్త పార్టీలకు ఓట్లు వేయడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్న సీఎం చంద్రబాబు ఏ పార్టీ వల్ల ప్రయోజనమో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.తమ ప్రభుత్వంపై నమ్మకంతోనే రాజధానికి రైతులుభూములు ఇచ్చారన్న చంద్రబాబు..వారిని రెచ్చగొట్టి రాజకీయం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.