బుల్లెట్ దిగిందా లేదా? పూరీ అండ్ త్రివిక్రమ్ స్టైల్లో బాబు పంచ్ డైలాగులు

 

నిన్నమొన్నటివరకు చంద్రబాబు మాట్లాడుతుంటే తెలుగుదేశం కార్యకర్తలకు సైతం బోర్ కొట్టేది. ఎప్పుడూ రొటీన్ కామెంట్స్... పైగా సుదీర్ఘ స్పీచ్ లు... వినలేక చచ్చేవారు... ఇక ప్రజలైతే ఎప్పుడు ముగిస్తార్రా బాబూ అంటూ తలలు పట్టుకునేవారు... కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రసంగాల్లో మార్పు కనిపిస్తోంది. రొటీన్ కి భిన్నంగా మాట్లాడుతున్నారు. పంచ్ డైలాగులతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మొన్నటిమొన్న బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుగా పూరీ అండ్ త్రివిక్రమ్ స్టైల్లో హాట్ కామెంట్స్ చేశారు. పాలిచ్చే ఆవును వదిలేసి... తన్నే దున్నను తెచ్చుకున్నారంటూ సింగిల్ డైలాగ్ తో బుల్లెట్ దించారు.

కృష్ణా కరకట్ట వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు... మరోసారి జగన్ ప్రభుత్వంపై పంచ్ డైలాగులు పేల్చారు. తన ఇంటిని ముంచాలని కుట్ర చేశారని, కానీ ప్రజలు బలైపోయారంటూ జనానికి అర్ధమయ్యేలా ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. కృత్రిమ వరదలను సృష్టించారు... ముందే నీళ్లు వదిలిపెట్టుంటే ప్రజల ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేవి కాదు... నా ఇంటిని ముంచాలని చూశారు... నా ఇల్లు మునగ లేదు... కానీ ప్రజలు బలైపోయారు... నా ఇంటిపైకి డ్రోన్లను పంపారు... డ్రోన్లతో ఫొటోలు తీయొచ్చు...బాంబులు కూడా వేయొచ్చు... కానీ నేను చావుకి భయపడేవాడిని కాదు... ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడతానంటూ సూటిగా సుత్తి లేకుండా మాట్లాడారు.

రాష్ట్రంలో పరిస్థితులకు తగ్గట్టుగా చంద్రబాబు వదులుతోన్న మాటల తూటాలు ప్రజల్లోకి బాగానే వెళ్తున్నాయి. అంతేకాదు బాబు పేల్చుతున్న పంచ్ డైలాగులకు తెలుగు తమ్ముళ్ల నుంచే కాదు... ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది.