అమరావతిని మార్చేస్తారా? రాజధానిపై బొత్స వ్యాఖ్యల కలకలం

 

అనుమానాలే నిజం కాబోతున్నాయా? వరల్డ్ క్లాస్ సిటీ కల కలగానే మిగిలిపోనుందా? నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మార్చేస్తారా? వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతోన్న ప్రచారం నిజంగానే నిజం కాబోతుందా? రాజధానికి మరో చోటికి మార్చేయబోతున్నారా? మంత్రి బొత్స వ్యాఖ్యలు దేనికి సంకేతం? సీనియర్ మంత్రిగా రాజధాని మార్పుపై ప్రభుత్వ స్టాండ్‌ను చెప్పేశారా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ఇప్పటికే నీలినీడలు కమ్ముకోగా, ఇప్పుడు మంత్రి బొత్స వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజధానిగా అమరావతికి అస్సలు సురక్షితం కాదని బొత్స తేల్చిచెప్పేశారు. శివరామకృష్ణ కమిటీ కూడా ఇదే చెప్పిందని గుర్తుచేశారు. అంతేకాదు అమరావతిపై ఆనాడు శివరామకృష్ణ కమిటీ చెప్పిందే.... ఇప్పుడు నిజమవుతోందన్నారు. ఓ మోస్తరు వర్షాలకే అమరావతి మునిగిపోతుందన్న బొత్స... ఇటీవల వచ్చిన వరదల్లో ఇది రుజువైందన్నారు. ఒకవేళ అమరావతిలో రాజధాని నిర్మించాల్సి వస్తే... డ్యాములు, కాలువలు కట్టాల్సి వస్తుందని, అలాగే వరద నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుందని వ్యంగ్యంగా మాట్లాడారు. అమరావతిలో ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని, ఇటీవల వరదల్లో అది తేలిందని చెప్పుకొచ్చారు. వరద, ముంపు బెడదను పక్కనబెడితే, అమరావతిలో నిర్మాణ వ్యయం భారీగా ఉందంటూ మరో బాంబు పేల్చారు. లక్ష రూపాయలయ్యే దానికి అమరావతి రెండు లక్షల ఖర్చు అవుతుందని అన్నారు. అదే ఇతర ప్రాంతాల్లో అయితే ఖర్చు భారీగా తగ్గుతుందంటూ చెప్పుకొచ్చారు. అయితే, రాజధాని నిర్మాణంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందన్న మంత్రి బొత్స.... త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందంటూ జగన్ సర్కారు వైఖరేంటో పరోక్షంగా చెప్పేశారు.

అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక, రాజధాని అమరావతిని మార్చేస్తారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది, జగన్ ప్రతిపక్షంలో ఉండగానూ ఈ మాటలు బలంగా వినిపించాయి. అయితే అలాంటి ఉద్దేశం లేదంటూ వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ అనుమానాలు మాత్రం తొలగిపోలేదు. ఇక ఇప్పుడు బొత్స వ్యాఖ్యలతో ఆ అనుమానాలు రెట్టింపు అయ్యాయి. మరి నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుందా? లేక మరో ప్రాంతానికి మారిపోతుందో తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.