డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు: దామాషా పద్ధతి భేష్ అన్న చంద్రబాబు.!
Published on: Sat Nov 28, 2026 8:08AM

డీలిమిటేషన్ ప్రక్రియలో జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులతో కలిసి మీడియాతో మాట్టాడిన ఆయన కీలక విషయాలు వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలను దామాషా ప్రకారం 50 శాతం పెంచడమే దక్షిణాది ప్రయోజనాలను కాపాడటంతో పాటు దేశ సమగ్రతకు సరైన మార్గమన్నారు.
జనాభా నియంత్రణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోతాయన్న ఆందోళన చాలా కాలంగా ఉందని గుర్తు చేసిన ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయడం వల్ల సంతానోత్పత్తి రేటు తగ్గిందన్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా సీట్ల సంఖ్యను గతంలో నిలిపివేశారని, ఇప్పుడు కొత్తగా జనాభా ప్రాతిపదికన మాత్రమే పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాల వాణి బలహీనపడే ప్రమాదం ఉందన్నారు. ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచితే దక్షిణాది ప్రాతినిధ్య నిష్పత్తి చెక్కుచెదరకుండా ఉంటుందని చంద్రబాబు చెప్పారు.
ఈ ప్రతిపాదిత విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు వివరించారు. అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి, తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కి, తెలంగాణలో 17 నుంచి 26కి, కేరళలో 20 నుంచి 30కి పెరుగుతాయని తెలిపారు. తద్వారా మొత్తం దక్షిణాది సీట్లు 129 నుంచి 195కి చేరి, ప్రస్తుత 23.76 శాతం వాటా యథాతథంగా నిలుస్తుందని చంద్రబాబు వివరించారు.

మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 33 శాతం మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు దిశగా ముందడుగు పడటం చారిత్రక పరిణామమన్న చంద్రబాబు.. 1996లో హెచ్.డి. దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా తాను ఈ బిల్లును తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలను ప్రత్యక్షంగా చూశాననీ, ఆ తర్వాత వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల కాలంలోనూ పలు యత్నాలు జరిగాయని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన అనుభవం పాలనలో సానుకూల ఫలితాలను ఇచ్చిందని వివరించారు.
ఇది కూడా చదవండి: డీలిమిటేషన్ ముసుగులో రాజ్యాంగాన్ని మార్చే యత్నం.. కేంద్రంపై గౌరవ్ గొగోయ్ విమర్శలు
మొత్తం సీట్ల సంఖ్యను 50 శాతం పెంచి, అందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా అటు పురుష ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యానికి ఇబ్బంది కలగకుండా, ఇటు మహిళలకు న్యాయం జరిగే సమతూకం సాధ్యమవుతుందనీ, ఇది ఏ ఒక్క వర్గానికో లేదా పార్టీకో పరిమితమైన అంశం కాదని, దేశ భవిష్యత్తుతో ముడిపడిన నిర్ణయమని పేర్కొన్నారు.

గతంలో బిల్లుల ఆమోద సమయంలో జరిగిన గందరగోళాలు, అడ్డంకుల వంటి పొరపాట్లను పునరావృతం చేయకుండా అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్ ఎందుకు అవసరం: దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేదెలా.?
డీలిమిటేషన్‌పై కేంద్రం మాస్టర్ ప్లాన్.. 2051 వరకు రాష్ట్రాల ప్రాతినిధ్యం స్థిరం.!
[Chandrababu Delimitation, Womens Reservation Bill, Delhi, Pressmeet, TeluguOne H.D. Kumaraswamy and Chandrababu, TeluguOne]


