కేసీఆర్ కి కేంద్ర మంత్రి విజ్ఞప్తి.. దీని వెనుక ఇంత రాజకీయముందా!!

 

తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ విషయంలో కుదరదని తేల్చి చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం.. ఆయనను పదే పదే కోరుతోంది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. దేశ‌వ్యాప్తంగా 'ఆయుష్మాన్ భార‌త్' ప‌థ‌కాన్ని మోడీ స‌ర్కారు అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, కేసీఆర్ సర్కార్ మాత్రం తెలంగాణ‌లో ఈ ప‌థ‌కం అమలు చేయ‌డం లేదు. ఎందుకంటే, అంత‌కంటే గొప్ప ప‌థ‌కాన్నే రాష్ట్రం అమ‌లు చేస్తోంద‌నేది కేసీఆర్ అభిప్రాయం. అదీగాక ఆయుష్మాన్ భార‌త్ ద్వారా కేంద్రం.. రాష్ట్రాల‌కు ఇస్తున్న బ‌డ్జెట్ చాలా త‌క్కువనని, తెలంగాణలో అంత‌కంటే గొప్పగా వైద్య‌సేవ‌ల‌న్నీ ఒకే గొడుకు కింద‌కి వ‌చ్చేలా త్వ‌ర‌లోనే ఒక విధానాన్ని తీసుకురాబోతున్నట్లు ఈ మ‌ధ్య‌నే కేసీఆర్ ప్ర‌క‌టించారు. అంటే.. ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని కేసీఆర్ స‌ర్కారు అమ‌లు చేయ‌దనేది చాలా చాలా స్ప‌ష్టం. అయినాస‌రే బీజేపీ మాత్రం.. ఈ విషయంలో కేసీఆర్ ని పదేపదే కోరుతూనే ఉంది. ఈ ప‌థ‌కం అమ‌లు గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్థ‌న్ తాజాగా మరోసారి స్పందించారు. ఈ ప‌థ‌కాన్ని తెలంగాణ‌లో అమ‌లు చేయాల‌ని సీఎం కేసీఆర్ ని కోరారు. 2022 నాటికి కొత్త భార‌త్ ను చూడాల‌నేది ప్ర‌ధాని మోడీ క‌ల అని, దానిలో భాగ‌మే ఈ ప‌థ‌క‌మ‌ని, ప్ర‌జ‌ల‌కు పెద్ద ఎత్తున మేలు జ‌రిగే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయాలంటూ కేసీఆర్ కి లేఖ రాశామ‌న్నారు. కేసీఆర్ మీద త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, ఆయుష్మాన్ భార‌త్ అమ‌లు చేస్తార‌ని హ‌ర్ష‌వ‌ర్థ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు. 

అయితే కేసీఆర్ ఈ పథకం అమలుపై సుముఖంగా లేరని తెలిసినా.. బీజేపీ ఆయనను పదే పదే విజ్ఞప్తి చేయడం వెనుక రాజకీయం ప్రయోజనం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణలో కేంద్ర ప‌థ‌కాలను కేసీఆర్ సర్కార్ అమలు చేయడం లేదని, రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కేసీఆర్ ని పదే పదే కోరడం వల్ల.. రాష్ట్ర బీజేపీ నాయకులకు కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుందని అంటున్నారు. సాక్ష‌త్తూ కేంద్ర‌మంత్రే చెప్పినా, ఇది ప్ర‌ధాని క‌ల అని చెప్పినా, ప్ర‌జ‌ల ఆరోగ్యానికి సంబంధించిన ప‌థ‌కం అని చెప్పినా కేసీఆర్ నిర్ల‌క్ష్యం చేస్తున్నారు అని మ‌రింత గ‌ట్టిగా మాట్లాడేందుకు అవ‌కాశం వ‌స్తుంది. దీంతో కేసీఆర్ పై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశముందని బీజేపీ భావిస్తోందట. అసలే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న బీజేపీ.. కేసీఆర్ సర్కార్ ని ఇబ్బంది పెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదలట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.