విజయసాయి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
posted on Jan 31, 2025 2:36PM
.webp)
వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 10 నుంచి మార్చి పది మధ్యలో ఓ పది హేను రోజులు విదేశాలకు వెళ్లేందకు సీబీఐ కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఇటీవల వైసీపీ పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి.. ఇక నుంచి పూర్తిగా రాజకీయాలకు దూరమౌతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక తన వ్యాపకం రాజకీయం కాదనీ, వ్యవసాయం మాత్రమేననీ విజయసాయి స్పష్టంగా చెప్పారు. రాజకీయ సన్యాసం తరువాత కొద్ది కాలం పాటు విదేశాలకు వెళ్లాలని భావించిన విజయసాయి రెడ్డి ఫ్రాన్స్ , నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 కావడంతో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వాలి.
దీంతో ఆయన తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ విదేశాలలో ఉన్న సమయంలో పార్టీకి గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి, ఆయన స్వదేశానికి రాగానే విదేశాలకు చెక్కేస్తున్నారని సెటైర్లు పేలుతున్నాయి.