TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బిస్లరీపై అంబానీ నీడ: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ రంగంలోకి రిలయెన్స్.!

Published on: Wed Nov 25, 2026 8:26AM

నిజం గడప దాటే సరికి, అబద్ధం పపంచాన్ని చుట్టి వస్తుందని అంటారు. సరిగ్గా అలాగే అని చెప్పలేం కానీ, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ రంగంలో దిగ్గజం అయిన బిస్లరీ విషయంలో ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతం దాదాపు అలాగే ఉంది. భారతదేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విభాగం భారీ వాణిజ్య వేదికగా నిలుస్తోంది. సుమారు  30 వేల  కోట్ల మార్కెట్   కలిగిన ఈ రంగంలో 30 శాతానికి పైగా వాటా  బిస్లరీదే.   కిన్లే, అక్వాఫినా వంటి బహుళజాతి సంస్థల బ్రాండ్లు కూడా పోటీలో ఉన్నా..   పంపిణీ నెట్‌వర్క్, బ్రాండ్ గుర్తింపు పరంగా బిస్లరీదే సింహభాగం.  

కానీ బిస్లరీ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు ఒకింత మసకబారింది. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఎఫ్ఎస్ఎఫ్ఏ బిస్లరీ వాటర్ ప్రామాణికత సరిగ్గా లేదన్న నివేదికే ఇందుకు కారణం. ఇక ఇప్పుడు విషయంలోకి వస్తే..   రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (ఆర్సీపీఎల్) ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం ఏడాదిన్నర కిందటే అంటే 2025 జూన్ లో  ఇందు కోసం 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అందు కోసం  ఆసియాలోనే అతిపెద్ద వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రిలయెన్స్ ఈ ప్రకటన చేసిన తరువాత.. అంటే సెప్టెంబర్ 2025లో  ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.   పన్ను తగ్గింపు వినియోగదారులకు ఊరట కలిగించే విషయమే అందులో సందేహం లేదు. అయితే..  తక్కువ ధరల వ్యూహంతో మార్కెట్లోకి వచ్చే సంస్థలకు ఇది అనుకూలం. దీంతో కేంద్రం జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం అంబానీకి, రిలయెన్స్ కు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. పన్ను తగ్గింపు ప్రకటించిన వారం రోజుల వ్యవధిలోనే..

 సెప్టెంబర్ 30, 2025న ఎఫ్ఎస్ఎఫ్ఏ  గోవాలోని బిస్లరీ ప్లాంట్ నుంచి ఆరు నీటి నమూనాలను సేకరించింది. వాటిలో ఐదు నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉండగా, ఒక నమూనాలో  మాత్రం  బ్రోమేట్  స్థాయి నిర్దేశిత పరిమితి కంటే అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు నివేదిక కూడా విడుదల చేసింది.  ఆ తరువాతి నెలలోనే అంటే 2025 అక్టోబర్ లోనే  రిలయన్స్ తక్కువ ధరల శ్రేణిలో  క్యాంపా ష్యూర్ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. గతంలో  క్యాంపా కోలా  ద్వారా శీతల పానీయాల రంగంలో అనుసరించిన తరహా వ్యూహాన్నే ఇక్కడా అమలు చేసినట్లు పరిశీలకులు, వ్యాపారవర్గాలు కూడా చెబుతున్నాయి. 

నాణ్యత పరీక్షల అంశంపై బిస్లరీ అప్పీల్ చేసి, ప్రైవేట్ ప్రయోగశాలల నివేదికలు సమర్పించినప్పటికీ సుమారు ఏడాది పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి స్పందన రాలేదు.   అయితే..  మార్కెట్లో పోటీ తీవ్రమవుతున్న వేళ..  ఈ ఏడాది నవంబర్ లో  బిస్లరీపై ప్రాసిక్యూషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకటించడం బిస్లరీ బ్రాండ్ ఇమేజ్ ను మసకబార్చడానికే అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసింది. ప్రజారోగ్యం, నాణ్యతా ప్రమాణాల పరంగా నియంత్రణ సంస్థ తన బాధ్యతను నిర్వర్తిస్తోందనే వాదన ఒక వైపు.. అయితే ఆ బాధ్యతను నిర్వర్తించడానికి ఎన్నుకున్న సమయం మరో వైపు.. బిస్లరీని పోటీలో వెనుకబడేలా చేసి క్యాంపా బ్రాండ్ కు మేలు చేసేలా ఉన్నాయన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.  ఏడాది పాటు పెండింగ్‌లో ఉన్న అప్పీల్ నేపథ్యంలో పోటీ ఉధృతమైన సమయంలో ప్రాసిక్యూషన్ అంశం తెరపైకి రావడం బ్రాండ్ ప్రతిష్ఠపై ప్రభావం చూపే అవకాశం ఉందని   పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్ వర్గాలు కూడా ఇదే అంటున్నాయి.  నియంత్రణ సంస్థల విధానాలు, పన్నుల మార్పులు, మార్కెట్ పోటీ సమీకరణాలు కలిసికట్టుగా పనిచేస్తున్న తీరుపై  భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛా మార్కెట్ నియమాలకు అనుగుణంగా, తక్కువ ధరలు, మెరుగైన సరఫరా, నాణ్యత ఆధారంగానే పోటీ సాగాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.

ఇది కూడా చదవండి:  అదానీ సంక్షోభం వెనక అజీమ్ ప్రేమ్ జీ ?

ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ రంగంలో వినియోగదారుల నమ్మకం, బ్రాండ్ విలువ   కీలకం దశాబ్దాలుగా మార్కెట్‌లో ఉన్న సంస్థలు తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, కొత్తగా బలమైన వనరులతో ప్రవేశిస్తున్న బ్రాండ్లు వేగంగా విస్తరించేందుకు యత్నిస్తున్నాయి. ధరల పోటీ, పంపిణీ సామర్థ్యం, నాణ్యతా ప్రమాణాల అంశాలలో ఒక బ్రాండ్ వ్యతిరేకంగా ఉండేలా జరుగుతున్న వరుస సంఘటనలపై ఇప్పుడు మార్కెట్ వర్గాలలో విస్తృత చర్చకు తెరలేచింది.  రానున్న రోజుల్లో బిస్లరీపై ప్రాసిక్యూషన్ ప్రక్రియ ఎలా ముందుకు సాగుతుంది. , అప్పీల్,  నివేదికల ఆధారంగా ఎలాంటి  నిర్ణయాలు ఉంటాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  అలాగే ఈ పరిణామాల కారణంగా  రిలయెన్స్ క్యాంపా ష్యూర్  మార్కెట్ వాటా ఏ స్థాయిలో , ఏ మేరకు పెరుగుతుంది అన్న విషయంపై కూడా మార్కెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  

మొత్తంగా   30 వేల కోట్ల రూపాయల ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్‌లో బిస్లరీ, క్యాంపా ష్యూర్ మధ్య పోటీ, నియంత్రణ సంస్థల చర్యల నేపథ్యంలో   మార్కెట్ పోటీ, నిబంధనల అమలులో పారదర్శకత, వినియోగదారుల ప్రయోజనాల అంశాల పారదర్శకతపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి.  

మీకు నచ్చవచ్చు: బిస్లరీ వాటర్ సురక్షితం కాదా: ప్రమాణాలకు అనుగుణంగా లేదు: ఎఫ్ఎస్ఎస్ఐ.!

Reliance Industries Q2 FY27: 33.8% ఎగిసిన లాభాలు.. రిలయన్స్ స్టాక్స్‌లో కొనుగోళ్ల జోరు!

[Campa. Bisleri dispute, packaged water market, Reliance Consumer Products, FSSAI notices, TeluguOne]