మళ్ళీ ‘టీఆర్ఎస్’గా మార్చాలా? ఎల్లెళ్ళవయ్యా!

కేసీఆర్ తన పార్టీ పేరును ఏ దుర్ముహూర్తంలో ‘టీఆర్ఎస్’ నుంచి ‘బీఆర్ఎస్’ అని మార్చాడో అప్పటి నుంచి ఆయన కుటుంబాన్ని, ఆయన పార్టీని దరిద్రం బబుల్ గమ్ అతుక్కున్నట్టు అతుక్కుంది. ఆ దరిద్రం పుణ్యమా అని అటు అధికారం పోయింది. ఇటు ముద్దుల కూతురు తీహార్ జైల్లో పడింది. పదేళ్ళ కేసీఆర్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఇంకా ముందు ముందు ఇంకెంత బ్యాండ్ పడనుందో ఆ భగవంతుడికే తెలియాలి.

తెలంగాణ ప్రజల్లో వున్న సెంటిమెంట్‌ని అడ్డం పెట్టుకుని, ఆంధ్ర ప్రజలను తిట్టిపోసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తన పార్టీ పేరును ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ నుంచి ‘భారత రాష్ట్ర సమితి’ అని మార్చడమే మామూలు విషయం కాదు.. పార్టీ పేరు బీఆర్ఎస్ అని మార్చిన సమయంలో పింక్ పిల్లకాయలంతా కేసీఆర్ ప్రధానమంత్రి కాబోతున్నారని కలలు కన్నారు. కేసీఆర్ కూడా ఆ ఊహల్లో ఊరేగారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరుతో హడావిడి చేశారు. ఇంతకాలం తాము తిట్టిపోసిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా బిఆర్ఎస్ బ్రాంచ్ ఓపెన్ చేశారంటే వీళ్ళ తెంపరితనానికి, నిస్సిగ్గు వైఖరికి ఇంతకంటే వేరే ఉదాహరణ వుంటుందా? శరీరంలో వున్న సిగ్గుని చివరి బొట్టు వరకూ బయటకి కక్కేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ శాఖ ప్రారంభించాలన్న ఆలోచన రాదు. 2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ కొంతకాలం ముఖ్యమంత్రిగా వుంటారు. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో వున్న ఎంపీ సీట్లన్నీ గెలుచుకుని, ఏకంగా మోడీని పక్కకి నెట్టేసి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారు... అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని తెలంగాణ ప్రజల్ని ఉద్ధరిస్తారు... ఇదీ బీఆర్ఎస్ వర్గాలు ఆరోజుల్లో కన్న పగటి కల. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆ కల కల్లగా మారిపోయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ వర్గాల్లో ‘పార్టీ పేరు మారిన తర్వాతే మనం మటాష్ అయిపోవడం ప్రారంభమైంది’ అనే అంతర్మథనం మొదలైంది. పార్టీ పేరు మార్చడం తప్పే అని చాలామంది పార్టీ నాయకులు కేసీఆర్ తిడతాడేమో అనే భయం కూడా లేకుండా బాహాటంగానే చెప్పారు. మరికొంతమంది అయితే, త్వరలో మా పార్టీ పేరు టీఆర్ఎస్‌గా మారబోతోంది అని ప్రకటించేశారు కూడా.

పార్టీ వర్గాల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంతోపాటు తన మనసులో కూడా వున్న ‘బీఆర్ఎస్’ ప్రభావం ప్రేరేపించడంతో కేసీఆర్ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారని తెలుస్తోంది. ఒక్కసారి పార్టీ పేరుని మార్చుకున్న తర్వాత పాత పేరును ఎన్నికల కమిషన్ ఐదేళ్ళపాటు ఫ్రీజ్ చేస్తుంది. ఐదేళ్ళపాటు ఆ పేరుని ఎవరికీ కేటాయించదు. మీరు మళ్ళీ మాకు టీఆర్ఎస్ పేరు కావాలంటే ఎలా సార్? ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్సయ్యారు సార్... అనే అర్థం వచ్చేలా ఎన్నికల సంఘం అధికారుల నుంచి రియాక్షన్ వచ్చిందట. దాంతో బీఆర్ఎస్ అనే పేరును టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రయత్నాలు మానేశారట. ఇప్పటికిలా సర్దుకుపోయి పేరు మార్పు సంగతి ఐదేళ్ళ తర్వాత ఆలోచిద్దామని డిసైడ్ అయ్యారట.