లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీస పోటీ కూడా అనుమానమే!?

బీఆర్ఎస్ (ఆవిర్బావ సమయంలో టీఆర్ఎస్) ఆవిర్బావం నుంచీ కూడా  ఇంతటి దయనీయ స్థితిలో ఎన్నడూ లేదు. ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడి లక్ష్య సాధన దిశగా జయంబు నిశ్చయంబు అంటూ సాగిన పార్టీ... ఇప్పుడు ఒక్క ఒకే ఒక్క ఓటమితో అధ: పాతాళానికి పడిపోయింది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ విపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఎదురుకాగానే చతికిల పడిపోయింది. పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు.

పార్టీ పరాజయం పాలై మూడు నెలలు పూర్తిగా అయ్యాయో లేదో అప్పుడే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు బైబై చెప్పేసి కాంగ్రెస్ గూటికే, కమలం చెంతకో చేరిపోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటికే  బీఆర్ఎస్ కు చెందిన 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. వీరంతా ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. పార్టీ మారిన వారిపై విమర్శలు చేయడానికి కూడా నైతిక అర్హత లేని స్థితిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. అధికారంలో ఉండగా కేసీఆర్ విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఆ పార్టీల నుంచి ఎమ్మెల్యేలనూ నేతలనూ గంపగుత్తగా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పుడు ఒప్పు అయినది.. ఇప్పుడు తప్పు అని చెప్పలేని స్థితిలో బీఆర్ఎస్ అధినేత ఉన్నారు. 

నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ అధినేత ఇప్పుడు సొంత పార్టీ నేతలను కూడా కట్టడి చేయలేనంత బలహీనంగా మారడానికి కారణం అధికారంలో ఉండగా ఆయన వ్యవహరించిన తీరు, అనుసరించిన ఒంటెత్తు పోకడలే అని చెప్పాలి. ఎన్నడూ విపక్షాలను అంత వరకూ ఎందుకు సొంత పార్టీ నేతలను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. కేబినెట్ సహచరులకు కూడా ప్రగతి భవన్ గేట్లు మూసే ఉండేవి. ఆయన కలవాలని భావిస్తేనే ఎవరికైనా ప్రగతి భవన్ ప్రవేశం. లేకుంటే లేదు అన్నట్లుగా కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం ఒక నియంతలా వ్యవహరించారన్న విమర్శలు అప్పట్లోనే ఉండేవి. అయితే అప్పుడు అధికారం చేతిలో ఉండటంతో ఆ విమర్శలను ఆయన ఖాతరు చేయలేదు. అంతెందుకు అసెంబ్లీలో విపక్ష నేతల ప్రజెన్స్ నే భరించలేను అన్నట్లుగా ఆయన వ్యవహరించిన తీరు ఉందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు.

తన విధానాలను వ్యతిరేకించే ఎవరినీ ఆయన అసెంబ్లీలో కూర్చోనీయలేదు. రేవంత్ రెడ్డి, పార్టీ నుంచి బయటక వెళ్లిన తరువాత ఈటల లను అసెంబ్లీలో అడుగుపెట్టనీయకుండా సస్పెన్షన్ వేట్లతో సభకు దూరంగా ఉంచడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు ఉదహరిస్తున్నారు. 

ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా తయారైందంటే ఆయన పిలిచి టికెట్ ఇచ్చినా లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ కడియం కావ్యను ప్రకటించిన తరువాత ఆమె ఓ బహిరంగ లేఖ రాసి పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించడమే కాకుండా కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సంకేతాలిచ్చారు.  ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నేతలు కూడా ఏ క్షణాన బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి మరక తమ మీద పడుతుందా అన్న భయంతో వణికిపోతున్నారు. అందుకే కేసీఆర్ కుటుంబ సభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఖండించేందుకు కూడా పార్టీ నేతలు ముందుకు రావడం లేదని అంటున్నారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు నిచ్చినా పార్టీ క్యాడర్ నుంచి కానీ, ప్రజల నుంచి కానీ కనీస స్పందన కరవైంది. అంతెందుకు కవితను రాజకీయ వేధింపుల కోసమే అరెస్టు చేశారంటూ కేసీఆర్ ఒక్కటంటే ఒక్క ప్రకటన కూడా చేయలేకపోయారు.

అదే కేజ్రీవాల్ ను ఇదే మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసినప్పుడు కేసీఆర్ ఖండించారు. అటువంటి ఖండన తన కూతురి విషయంలో చేయలేకపోయారు. సొంత తండ్రే స్పందించలేదంటే కవితకు కుంభకోణంలో పాత్ర ఉందనే కదా అని జనం చర్చించుకుంటున్నారు. ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు, సవాళ్లు ఆయనలోని అసహనాన్ని బయటపెడుతున్నాయే తప్ప ప్రజల నుంచి స్పందన మాత్రం కానరావడం లేదు. ఈ పరిస్థితుల్లో రానున్న లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఏ మేరకు కాంగ్రెస్, బీజేపీలకు పోటీ ఇవ్వగలదు అన్నది ప్రశ్నార్ధకమేనని పరిశీలకులు అంటున్నారు.