బ్రదర్ అనిల్ కు క్లీన్ చిట్ ఇచ్చిన వెంకటరెడ్డి

 

గత కొద్ది రోజులుగా బీజేపీ వైయస్సార్ కుటుంబం సభ్యులపై ముఖ్యంగా మతప్రచారకుడిగా పనిచేస్తున్న బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నసంగతి అందరికి తెలిసిందే. మళ్ళీ, ఇటీవల బ్రదర్ అనిల్ కుమార్ కు చెందిన మైనింగ్ కంపెనీకి బినామి యజమానిగా పేర్కొంటున్న తేళ్లూరి వీరభద్రారెడ్డి అనుమానాస్పద మరణానికి బ్రదర్ అనిలే కారకుడని ఆ పార్టీ ఆరోపించడంతో వైయస్సార్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురయినట్లు కనిపిస్తోంది.

 

గత మూడు రోజులుగా పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా మృతుడు వీరభద్రారెడ్డి స్వహస్తాలతో వివిధ సంస్థలకు వ్రాసిన ఉత్తరాలను, ఫైళ్ళను స్వాదీనం చేసుకొని తమ కార్యాలయానికి తరలించడంతో, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు బ్రదర్ అనిల్ కుమార్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తమ దాడి మరింత తీవ్రతరం చేసాయి.

 

వారి దాడిని తిప్పికొట్టే ప్రయత్నంలో ఈ రోజు వైయస్సార్ కుటుంబ పత్రిక ‘సాక్షి’ లో మృతుడు వీరభద్రారెడ్డి తండ్రి వెంకటరెడ్డి మీడియాతో చెప్పిన విషయలంటూ ఒక కధనం ప్రచురించింది. ‘తన కుమారుడు వీరభద్రారెడి గతనెల 25వ తేదిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలోని పోచంపల్లి గ్రామశివార్లలో మృతి చెందాడని, తన కుమారుడి మరణానికి బ్రదర్ అనిల్‌కుమార్‌కు ఎటువంటి సంబంధం లేదని, కానీ కొందరు రాజకీయ నాయకులూ వారి పార్టీలు తన కొడుకు మరణాన్ని రాజకీయం చేస్తున్నట్లు తెలిసి చాల బాధపడుతున్నానని వెంకటరెడ్డి తెలిపారు. కుమారుడుని పోగొట్టుకొని దుఃఖంతో ఉన్న తమ కుటుంబం పట్ల, మీడియా కూడా నిర్దయగా వ్యవహరిస్తూ, తన కుమారుడికీ బ్రదర్ అనిల్ కుమార్ కి ఏమి సంబంధాలున్నాయని ఆరాలు తీయడం చాలా బాధ కలిగించిందని అన్నారు. తన కుమారుడు చనిపోయేవరకు కూడా బ్రదర్ అనిల్ ఎవరో తమకు తెలియదన్నారు. తానూ నిరక్షరాస్యుడినని, అందువల్ల కాగితాలు, డాక్యుమెంట్ల గురించి తనకు ఏమి తెలియదని, పోలీసులే విచారణ చేసి తన కొడుకు మృతికి కారకులను, కారణాలను కనిపెట్టాలని ఆయన అన్నారు.”

 

అయితే, ఇప్పుడు మృతుడు తండ్రి వెంకట రెడ్డి చెప్పిన విషయాన్నే పోలీసులు, కోర్టులు కూడా ద్రువీకరిస్తే దానికి విలువుంటుంది తప్ప ఈ విధంగా వైయస్సార్ కుటుంబానికే చెందిన సాక్షి పత్రిక ద్వారా తమ కుటుంబానికే చెందిన వ్యక్తి బ్రదర్ అనిల్ కుమార్ కి క్లీన్ సర్టిఫికేట్ జారి చేయడంవల్ల ఏ ప్రయోజనం ఉండదు.

 

వైయస్సార్ కుటుంబంపై బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీలు చేస్తున్నఆరోపణలను ఈ విధంగా పత్రికల ద్వారా ఎదుర్కోవడం కంటే నేరుగా కోర్టులో వారిపై కేసులు వేసి వారు చేస్తున్న ఆరోపణలను నిరూపించమని సవాలు చేయడం ద్వారా వైయస్సార్ కుటుంబము తన నిజాయితీని రుజువు చేసుకోవడం మంచిది.