కేసీఆర్ కట్టడం మరోటి కూలింది!

కేసీఆర్ కట్టడం కూలిందంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో వున్న కట్టడం కూలిందనో, హైదరాబాద్ నంది నగర్లో ఆయనకు చెందిన 5 వందల గజాల్లో కట్టుకున్న  పేద కుటీరం కూలిందనో అనుకోవద్దు. ఆయన ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన మరో కట్టడం కూలిపోయింది. కేసీఆర్ తన ఇంజినీరింగ్ ప్రతిభతో, మెదడుని, రక్తాన్ని రంగరించి డిజైన్ చేసిన మేడిగడ్డ రిజర్వాయిర్ మేడిపండును తలపిస్తూ ముక్కలు చెక్కలు అయిపోయింది. ఇప్పుడు ఆ అదృష్టం ఓ బ్రిడ్జికి పట్టింది. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగు మీద నిర్మాణంలో వున్న వంతెన సోమవారం రాత్రి కూలిపోయింది. 2016లో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణంలో కూడా ఇంజనీర్లకే ఇంజనీర్ కేసీఆర్ ప్లానుందేమో తెలియదు. 2016 నుంచి ఇప్పటి వరకు అంటే, ఎనిమిదేళ్ళపాటు ఈ బ్రిడ్జిని కడుతూనే వున్నారు. ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదు. జనం ఈ బ్రిడ్జిని నమ్ముకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బ్రిడ్జి కూలిపోయింది. పోన్లే.. ఎవరికీ ఏమీ కాలేదు!